ఆమె కోసం ఆమరణ దీక్ష.. హాట్ టాపిక్ అయిన కౌశల్

ఆమె కోసం ఆమరణ దీక్ష.. హాట్ టాపిక్ అయిన కౌశల్

గత సంవత్సరం ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్-2 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో స్టార్ అయిపోయాడు ప్రముఖ నటుడు కౌశల్. ఆ షోలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో చాలా మంది ఆర్మీలా తయారై అతడిని విన్నర్‌ను చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది. అప్పటి నుంచి అడపాదడపా మీడియా ముందుకు వస్తున్న కౌశల్.. సామాజిక, రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం కౌశల్ ఆర్మీ విషయంలో వివాదం చెలరేగినా.. అతడి ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గలేదు.

 తాజాగా కౌశల్ ఓ సంచలన ప్రకటన చేశాడు. మూడు రోజుల క్రితం హన్మకొండలో కామాంధుడి చేతిలో హత్యాచారానికి గురైన శ్రీహిత కోసం నిరాహారదీక్ష చేయడానికి ముందుకు వచ్చాడు. దీని కోసం శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో భాగంగానే ఆదివారం హన్మకొండలో నిరాహార దీక్ష చేయడానికి ప్రయత్నం చేశాడట. కానీ, పోలీసులు ఈ దీక్షకు అనుమతి లేదంటూ భగ్నం చేశారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, తమకు కొంత సమయం కావాలని అడిగారట. ఈ విషయాలను కౌశల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించాడు.

"మేము వరంగల్ వెళ్లి శ్రీహిత కుటుంబాన్ని కలుసుకున్నాం. మేము అండగా ఉంటామని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. శ్రీహిత చనిపోయిన 11 రోజుల లోపే నిందితుడ్ని శిక్షిస్తాం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు హామీ వచ్చిందని శ్రీహిత తండ్రి జగన్ మాకు చెప్పారు. ఇక నేను చేపట్టిన నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసి.. సోమవారం వరకూ సమయం కోరారు. అప్పటి వరకూ వేచి చూస్తాం" అని కౌశల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ పరిణామంతో బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.

 వాస్తవానికి అంతకు ముందు కౌశల్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇందులో దీక్షకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. "అందరికీ నమస్కారం. హన్మకొండలో చిన్నారి శ్రీహితకు జరిగిన అన్యాయం మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ శ్రీహితకు న్యాయం కావాలని కోరుతున్నారు. కానీ, అటు పోలీసుల నుంచి కానీ, ఇటు న్యాయస్థానం నుంచి కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. అందుకే మేము రెండు అడుగులు ముందుకేసి శ్రీహిత కోసం ఆమరణ నిరాహార దీక్ష చేద్దామని అనుకుంటున్నాం.

 రేపు ఉదయం 10 గంటలకు ఆమె తల్లిదండ్రులను కలుసుకుని, అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ఎదురుగా ఈ దీక్ష చేయాలనుకుంటున్నాం. ఎవరైతే శ్రీహితకు న్యాయం కావాలని కోరుకుంటున్నారో.. ఎవరైతే ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకూడదని కోరుకుంటున్నారో.. వాళ్లందరూ వచ్చి మాతో పాలుపంచుకుని ఈ దీక్షను విజయవంతం చేస్తారని, శ్రీహితకు న్యాయం జరిగేలా చేస్తారని, అందరూ ఉప్పెనలా మారి ఈ సంఘటనకు ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అంటూ అందులో పేర్కొన్నాడు.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English