సీఎం అయ్యాక జగన్ నిర్ణయంపై తొలిసారి అసంతృప్తి

సీఎం అయ్యాక జగన్ నిర్ణయంపై తొలిసారి అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆయన పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి సారించారు. చకచకా నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా తన తొలి సంతకాన్ని కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకే ఉపయోగించారు. నెల రోజుల వ్యవధిలో ఆయన ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నింటికీ పార్టీ నేతల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా భారీ స్పందన వస్తోంది.

 దీంతో తక్కువ వ్యవధిలోనే ముఖ్యమంత్రి జగన్‌కు మంచి పేరు వచ్చింది. అయితే ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయంలో చాలా మంది తమ వ్యతిరేకతను వెల్లగక్కుతున్నారు. అదే.. ‘అమ్మఒడి’ పథకం అమలు ప్రక్రియ. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ జగన్ పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతీ తల్లికీ ఏటా 15 వేల రూపాయల సాయం అందిస్తామని ప్రకటించారు. దీనిని అమలు చేసేందుకు ఈ పథకాన్ని తీసుకు వచ్చారు. అయితే, దీనిపై ఉన్న అనుమానాలకు ఏపీ ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టేసింది.

 ఇన్ని రోజులు ‘అమ్మఒడి’ పథకం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారికి మాత్రమే వర్తింస్తుందని ప్రచారం జరిగింది. దీంతో చాలా మంది తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో మాన్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. దీంతో ఊళ్లలోని సర్కారు బడులు పిల్లలతో కళకళలాడాయి. కొన్ని చోట్ల అయితే తమ పాఠశాలల్లో ఖాళీలు లేవని బోర్డులు కూడా పెట్టేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వచ్చాయని అంతా అనుకుని, వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన వారికి షాకిచ్చింది.

 ఆదివారం సీఎం కార్యాలయం నుంచి ‘అమ్మఒడి’ పథకానికి సంబంధించిన వివరాలతో ఓ లేఖ విడుదలైంది. త్వరలో అమలు చేయనున్న అమ్మఒడి పథకం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకూ వర్తిస్తుందని సీఎంవో కార్యాలయం స్పష్టత ఇచ్చింది. అంటే ఏ పాఠశాలలో చదివినా ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని స్పష్టమైంది. దీంతో సీఎం నిర్ణయంపై ప్రజల నుంచి తొలిసారి ప్రతికూల స్పందన వస్తోంది. ప్రైవేటు పాఠశాలల వల్ల సర్కారు బడుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో ‘అమ్మఒడి’ పథకం ఏమాత్రం ఉపయోగకరం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 అంతేకాదు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే పిల్లలు ఈ డబ్బులను ఆధారంగా చేసుకుని ప్రైవేటు స్కూళ్లకు తరలిపోతే ప్రమాదం కూడా ఉంది. దీంతో అన్ని సౌకర్యాలు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ఆస్కారముంది. అప్పుడు వాటిపై ప్రభుత్వం వెచ్చించిన కోట్లాది రూపాయల ప్రజాధనం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. దీనికితోడు, ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో చేరిన వారు కూడా వెనక్కి వెళ్లిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లోనే కాదు విద్యావేత్తల నుంచి కూడా ప్రతికూల స్పందన వస్తోంది.

 అయితే, ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచడం కోసమే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలైనా, ప్రైవేటు పాఠశాలలైనా.. పిల్లలు చదువుకోవడమే తమ లక్ష్యమనే ఉద్దేశ్యంతో ఏపీ గవర్నమెంట్ ఉందని తెలిసింది. అందుకే ఎక్కడ చదివిస్తున్నారన్నది ముఖ్యం కాదు.. చదివిస్తున్నారా..? లేదా..? అన్నదే ముఖ్య అజెండాగా ముందుకు వెళ్తామని సీఎం ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీలోని కొందరు నేతలు స్పష్టం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English