అయ్యో సుజ‌నా...బీజేపీ అప్పుడే షాకిచ్చిందా

అయ్యో సుజ‌నా...బీజేపీ అప్పుడే షాకిచ్చిందా

కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఎంపీ సుజ‌నా చౌద‌రికి ఆదిలోనే షాక్ త‌గిలింద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. సుజనా చౌదరి త‌న‌తో పాటు స‌హ‌చ‌ర ఎంపీలు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గ‌రిక‌పాటి మోహన్‌రావులతో క‌లిసి పార్టీ ఫిరాయిస్తూ...తెలుగుదేశం రాజ్యసభ లెజిస్లేచర్ పార్టీని బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనమయ్యేలా చేసిన సంగ‌తి తెలిసిందే.

టీడీపీ రాజ్యసభ లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తూ టీడీపీ రాజ్య‌స‌భ ప‌క్ష నాయకుడి హోదాలో సుజనా చౌదరి అంద‌జేసిన లేఖ ప్ర‌కారం రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులోని 4వ పేరాను అనుస‌రించి రాష్ట్రప‌తి విలీనం చేశారు. ఇంత చేసిన సుజ‌నా చౌద‌రికి ఆయ‌న‌పై ఉన్న ఆర్థిక అభియోగాల విష‌యంలో ఉప‌శ‌మ‌నం ద‌క్కుతుందనుకుంటే..తిరిగి షాక్ త‌గింది.

సుజ‌నాచౌద‌రిపై తీవ్ర‌మైన ఆర్థిక అభియోగాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈడీ విచార‌ణ‌ను సైతం ఆయ‌న గ్రూపు ఎదుర్కుంటోంది. దీంతో ఈ కేసుల నుంచి ఉప‌శ‌మ‌నం కోస‌మే...సుజ‌నా బీజేపీలో చేరార‌నే చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అభియోగాలు ఉండి తమ పార్టీలో చేరుతున్న టీడీపీ ఎంపీలకు తాము ఎటువంటి హామీలు ఇవ్వలేదని, రాజ్యసభలో తమ సంఖ్యాబలం తక్కువగా ఉన్నందునే తెలుగుదేశం సభ్యులను చేర్చుకున్నట్లు స్పష్టం చేశారు.

గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తాను టీడీపీ రాజ్యసభ సభ్యులను విమర్శించింది నిజమేనని, వారు కూడా తమను విమర్శించారన్నారు.  వారిపై వచ్చిన అభియోగాలపై వారే సమాధానం చెప్తారని, తమ పార్టీలో చేరిన వారికి మంచివారు అని తాము సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు.

దేశాభివృద్ధిని కాంక్షించే తాము బీజేపీలో చేరినట్లు టీడీపీ సభ్యులు చెప్పారని జీవీఎల్ పేర్కొన్నారు. బీజేపీలో చేరిన వారు పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడే పనిచేయాలన్నారు. 2024 నాటికి రాష్ట్రంలో బలీయమైన శక్తిగా బీజేపీ ఎదుగుతుందని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి చూసే బీజేపీకి ప్రజలు ఓట్లు వేసి 303 స్థానాల్లో బీజేపీకి పట్టం కట్టారన్నారు. 2024 నాటికి మరో 50 స్థానాల్లో విజయం సాధించే దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.

అందులో భాగంగా గత ఐదేళ్లలో 9 కోట్ల మందికి మరుగుదొడ్ల నిర్మాణం, 7 కోట్ల మంది మహిళలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందజేశామన్నారు. మరో 3 కోట్ల కుటుంబాలకు దేశవ్యాప్తంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. రానున్న ఐదేళ్లలో దేశంలోని 14 కోట్ల కుటుంబాలకు నీటి సరఫరా చేసి, 70 కోట్ల మంది ప్రజలకు మంచి చేయాలన్నదే మోదీ లక్ష్యమన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English