KCR: పార్టీ ఎమ్మెల్యేల‌పై నిఘా!

త‌మ పార్టీ ఎమ్మెల్యేలు, ఇత‌ర ముఖ్య నాయ‌కులు జ‌నంలోనే ఉండాల‌ని.. జ‌నం కోస‌మే తిర‌గాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించార‌ని స‌మాచారం. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఎవ‌రూ హైద‌రాబాద్, ఇత‌ర ప్రాంతాల‌కు ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకోవ‌ద్ద‌ని.. నిరంత‌రం ప్ర‌జ‌ల‌ని క‌నిపెట్టుకొని ఉండాల‌ని సూచించార‌ట‌. దీంతో ఆయా జిల్లాల్లో నేత‌ల ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక చందంగా మారింద‌ట‌. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డం.. ప్ర‌జ‌ల్లో క్ర‌మంగా వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డంతో అధికార పార్టీ నేత‌ల్లో గుబులు మొద‌లైంద‌ట‌.

ఆర్థికంగా కూడా క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని భావిస్తున్నార‌ట‌. ఇటీవ‌ల ప‌లు ప‌థ‌కాలు ప్రారంభించినా అవి స‌క్ర‌మంగా అమ‌లు కాక‌పోవ‌డం.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓడిపోవ‌డం.. ఆ ప్ర‌భావం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై కూడా ప‌డ‌డంతో ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆలోచ‌నా ధోర‌ణి మారింద‌ట‌. ఎమ్మెల్యేలు, ఇత‌ర ముఖ్య నేత‌లు మిగ‌తా రోజుల్లో వారంలో రెండు మూడు రోజులు జిల్లాల్లో.. మూడు నాలుగు రోజులు హైద‌రాబాద్‌లో ఉంటుండేవారు. ఇక‌పై వారంలో ఐదు లేదా ఆరు రోజులు స్థానికంగానే ఉండేందుకు ప్లాన్ చేసుకోవాల‌ని.. జ‌నంలో వ్య‌తిరేక‌త త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లాయ‌ట‌.

ఇక‌పై వ‌చ్చే రెండేళ్లు నేత‌ల‌పై నిఘా పెడ‌తామ‌ని.. ఎవ‌రూ కూడా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి వీల్లేద‌ని సూచించార‌ట‌. ఎమ్మెల్యేలు నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ఉంటున్నారా? లేదా? అనే అంశంపై ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు ఇంట‌లిజెన్స్ వ‌ర్గాల ద్వారా స‌మాచారం సేక‌రిస్తోంద‌ట‌. ఈ నేప‌థ్యంలో గ్రామాల్లో జ‌రిగే ప్ర‌తీ శుభ‌, అశుభ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యేందుకు నేత‌లు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. ఏ కార్య‌క్ర‌మం కూడా మిస్స‌వ‌కుండా చూడాల‌ని త‌మ పీఏల‌కు పుర‌మాయిస్తున్నార‌ట‌. లేదంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ గ్యారంటీ ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తున్నార‌ట‌.

ఇదిలా ఉంటే ఈ అంశంపై ఎమ్మెల్యేల్లో గుబులు మొద‌లైంద‌ట‌. ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడేళ్ల‌యినా ఏ కార్య‌క్ర‌మం కూడా స‌రిగ్గా అమ‌లు కాక‌పోవ‌డం.. ప‌థ‌కాల అమ‌లు ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డి మాదిరిగానే ఉండ‌డంతో జ‌నాల్లో తిరిగేందుకు జంకుతున్నార‌ట‌. కులాల వారీగా.. మ‌తాల వారీగా వ‌స్తున్న నిధుల ప్ర‌తిపాద‌న‌ల‌ను త‌మ సొంత ఖ‌ర్చుతో ఆమోదించేలా ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నార‌ట‌. దీంతో వ‌చ్చే రెండేళ్లు ఇలాంటివి ఎన్ని భ‌రించాలోన‌ని బెంబేలెత్తుతున్నార‌ట‌. ఇక‌పై జ‌నం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు నేత‌లు ఎలాంటి ప్ర‌ణాళిక‌లు వేసుకుంటారు..? ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు ఉంటాయి..? జ‌నం వ్య‌తిరేక‌త‌ను దాటుకుంటూ ఎలా ముందుకు వెళ‌తారు..? అనేది వేచి చూడాలి.