బాబుకు తాజా అవ‌మానం...అక్ర‌మం పేరుతో రాజ‌కీయం

బాబుకు తాజా అవ‌మానం...అక్ర‌మం పేరుతో రాజ‌కీయం

ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ చ‌ర్య‌ల‌తో తెలుగుదేశం పార్టీకి  మరో షాక్‌ తగిలింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నివాసం ఉంటున్న ఉండవల్లిలోని ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రజావేదికలో ప్రస్తుతం ఉన్న టీడీపీకి సంబంధించిన సామగ్రిని తీసుకెళ్లాలని ఆ పార్టీ నేతలకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ప్రజా వేదికను తమకు కేటాయించాలని వారం రోజుల క్రితం ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాసిన‌ప్ప‌టికీ...విదేశాల్లో ఉన్న స‌మ‌యంలో ఈ వేదిక‌ను త‌మ అదుపులో తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కార్యకర్తలు, ప్రజలతో అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రజావేదికను కేటాయించాలని ఇటీవ‌ల లేఖ రాశారు. అయితే, దీనిపై నిర్ణ‌యం పెండింగ్‌లో ఉండ‌గానే స్వాధీనం చేసుకున్నారు. తొలిసారిగా ఈ నెల 24న ప్రజావేదికలోనే కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సచివాలయం ఐదో బ్లాక్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ జరగాల్సి ఉంది. కానీ సదస్సును ప్రజావేదికకు మారుస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

ఇదిలాఉండ‌గా, ప్రజావేదిక ఎదుట టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వ‌హించి ప్ర‌భుత్వం తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ, ప్రజావేదిక ఇవ్వాలని సీఎంకి స్వయంగా చంద్రబాబు లేఖ రాశారన్నారు. చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలో స్వాధీనం చేసుకోవడం ఖండిస్తున్నామ‌ని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇతర కార్యక్రమాలు పెడితే చంద్రబాబు భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కనీస సమాచారం లేకుండా ప్రజావేదిక ను  స్వాధీనం చేసుకోవడం ఖండిస్తున్నామ‌ని తెలిపారు.

చంద్రబాబు నివాసం అక్రమ కట్టడం అయితే స్వామీజీ పూజలు చేసిన ప్రాంతం దేనికిందకు వస్తుందని రామానాయుడు సూటిగా ప్ర‌శ్నించారు. ప్రజావేదిక కూడా అక్రమ కట్టడం అయితే కలెక్టర్ల సదస్సు  ఎలా నిర్వహిస్తారని ఆయ‌న నిల‌దీశారు. ప్రజావేదిక ఖాళీ చేయమని రాతపూర్వకంగా ఇస్తే తప్పకుండా ఖాళీ చేస్తామ‌ని తెలిపారు. సీఎం వాడుకున్న భవనాన్ని ఖాళీ చేయాలంటే ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English