3 టాయిలెట్లే క‌ట్ట‌లేదు.. 3 రాజధానులా?: CBN

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా ఏపీ ప్ర‌భుత్వంపై ఫైర‌య్యారు. త‌న‌దైన శైలిలో ఆయ‌న కౌంట‌ర్లు ఇచ్చారు. మూడురాజ‌ధానుల ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అయింద‌ని..అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు టాయిలెట్ల‌ను కూడా నిర్మించ‌లేద‌ని.. అలాంటి ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులు క‌డుతుందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న‌ సీపీఎస్‌ రద్దుపై జగన్ హామీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు.

హామీ నెరవేర్చని జగన్ ఇప్పుడేం చెబుతారన్నారు. కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలా జగన్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని దారుణంగా ధ్వంసం చేశారని మండిపడ్డారు. 3 టాయిలెట్లు కూడా కట్టలేని జగన్ 3 రాజధానులు కడతారా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో బిచ్చం ఎత్తుకుంటోందని తీవ్రంగా మండిపడ్డారు. ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని కేంద్రాన్ని ప్రాధేయపడుతున్న వైసీపీ సర్కార్.. రాష్ట్ర హోదా, అమరావతి, పోలవరం గురించి అడగడం లేదా? అని దుమ్మెత్తి పోశారు.

రాష్ట్రంలో కొందరు వైసీపీ సర్కారుకు పేటియం బ్యాచ్లా తయారయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. ఇసుక‌, మ‌ద్యం, భూములు.. గ‌నులు.. ఇలా అన్నింటిలోనూ.. దోపిడీ చేస్తున్నార‌ని.. దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌తి ఒక్క‌నేతా.. క‌బ్జాకోరుగా.. ద‌గాకోరుగా.. పేటీఎంగా మారిపోయాడ‌ని నిప్పులుచెరిగారు. ఒక జడ్జి ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని అంటున్నారు. రాష్ట్రంలోని దారుణ పరిస్థితులు ఈ జడ్జిలకు పట్టవా?. రాష్ట్రంలో కొన్ని పే టీమ్ బ్యాచ్‌లు తయారయ్యాయి.

ఆత్మహత్యలు, అల్లకల్లోలాలు ఆ జడ్జిలకు కనపడవా! ఒక నేరస్థుడికి ఇలాంటివారు మద్దతు ఇవ్వవచ్చా! అని చంద్ర‌బాబు అన్నారు. అదేస‌మ‌యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఉద్దేశించీ చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఒకాయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. కుమారుడికి పదవి తీసుకుని జగన్‌ను పొగుడుతున్నారు అని చంద్రబాబు విమర్శించారు. రిటైర్‌ అయ్యాక వీరికి( మాజీ జడ్జీలకు) పదవులు కావాలని, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.