TDP: రెండున్న‌రేళ్ల క‌ష్టం సున్నా?

రాజ‌కీయాల్లో `ఆశ‌-అవ‌కాశం` అనే రెండు ప‌ట్టాల‌పైనే నేత‌ల ప్ర‌యాణం ఆధార‌ప‌డుతుంది. ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాం.. పార్టీలో ఏదైనా అవ‌కాశం ద‌క్క‌క‌పోతుందా? అనే ఆశ నాయ‌కుల‌ను కార్య‌క‌ర్త‌ల‌ను న‌డిపిస్తుంది. ఇదేపార్టీల‌ను గెలిపించే ప్ర‌ధాన సూత్రంగా కూడా ప‌నిచేస్తోంది. అయితే.. టీడీపీలో మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు ఆ పార్టీని తీవ్ర‌స్థాయిలో ఇరుకున ప‌డేస్తున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల మ‌ధ్య నిరాశ‌.. నిస్పృహ‌లు క‌లిగించేలా చేస్తున్నాయి. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రి పోరు చేసే ప‌రిస్థితి ఏ కోశానా క‌నిపించ‌డం లేదు. అంటే..  పార్టీ ఖ‌చ్చితంగా పొత్తుల‌తోనే ముందుకు సాగ‌నుంది. అంటే.. పొత్తు పార్టీకు సీట్ల కేటాయింపు త‌ప్ప‌ని స‌రి!.

ఇదే జ‌రిగితే.. దాదాపు 50 స్థానాలను క‌నీసంలో క‌నీసంగా టీడీపీ వ‌దులుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఆయా 50 స్థానాల్లోనూ టీడీపీ నేత‌లు దూరంగా ఉండ‌డంతోపాటు.. పార్టీ పిలుపు మేర‌కు వేరే పార్టీకి ఇక్క‌డ ప్ర‌చారం చేసి పెట్టాలి.  అంతేకాదు.. టీడీపీ ఓట్ల‌నుకూడా ఆయా పార్టీల‌కు అనుకూలంగా వేయించాలి. త‌ద్వారా.. పొత్తు పార్టీల నేత‌ల‌ను కూడా గెలిపించే బాధ్య‌త టీడీపీ నేత‌ల‌పైనే ఉంటుంది. అయితే.. అస‌లు ఇప్పుడు  ఏం జ‌రుగుతోందో చూద్దాం. చంద్ర‌బాబు పిలుపు మేర‌కు.. నాయ‌కులు రోడ్డుమీద ప‌డుతున్నారు. ప్ర‌భుత్వంపై వీరోచితంగా పోరాడుతున్నారు. కేసులుకూడా ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గా్ల‌లోనూ బ‌లంగా పోరాడుతున్నారు.

దీనికి కార‌ణం.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాలు త‌మ‌కు ద‌క్కుతాయ‌ని..వ చ్చే ఎన్నిక‌ల్లో తాము గెలుపుగుర్రం ఎక్కుతామ‌ని..వారిలో ఆశ‌లు స‌జీవంగా ఉండ‌డ‌మే. అయితే.. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల అంత‌రార్థంపై అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు ఉంటుంద‌నే సంకేతాలు దాదాపు టీడీపీలో క్షేత్ర‌స్థాయికి చేరిపోయాయి. అంటే.. ఎవ‌రికి ఎక్క‌డ అవ‌కాశం ఉంటుందో.. వ‌స్తుందో .. తెలియ‌ని ఒక సందిగ్ధ‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో నేత‌లు .. “మేం పోరాడుతున్నాం… పార్టీని బ‌లోపేతం చేస్తున్నాం. తీరా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ టికెట్ వేరే పార్టీకి కేటాయిస్తే.. ఏం జ‌రుగుతుంది?“ అనే చ‌ర్చ చేస్తున్నారు.

మ‌రోవైపు.. ఇంకో విశ్లేష‌ణ కూడా జ‌రుగుతోంది. టీడీపీలో సీనియ‌ర్లు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏదో గెల‌వ‌ని స్థానాల‌ను ఆయా పార్టీల‌కు ఇస్తారులే.. మీరు ప‌నిచేసుకోండి.. త‌ప్ప‌కుండా.. మీకే అవ‌కాశం వ‌స్తుంది.. అని చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. నిజానికి ఈ వ్యూహం ఏమాత్రం ఫ‌లించేది కాదు. ఎందుకంటే.. పొత్తు పెట్టుకునే ఏ పార్టీ అయినా.. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ‌కు బ‌లం ఎంత‌..?  త‌మ బ‌లం లేక‌పోతే.. టీడీపీ ఓట్ల‌యినా.. త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌నే ఆలోచ‌న ఉన్న‌ప్పుడే.. పార్టీలు ఆ యా సీట్ల‌లో పోటీకి రెడీ అవుతాయి. అంతేత‌ప్ప‌.. ఎక్క‌డ బ‌డితే.. అక్క‌డ టికెట్లు ఇస్తే.. తీసుకునే ప‌రిస్థితి ఉండ‌దు. సో.. మొత్తానికి టీడీపీ అంతో ఇంతో బ‌లంగా ఉన్న స్థానాల్లోనే మిత్ర ప‌క్షాలు కూడా కోరుకుంటాయి . దీంతో ఈ రెండున్న‌రేళ్లుగా తాము చేస్తున్న క‌ష్టం నాశ‌నం అయిన‌ట్టేనా? అని చాలా మంది నాయ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.