త‌మిళ తంబీలను చూసి నేర్చుకోండి.. కేసీఆర్ హితభోధ

త‌మిళ తంబీలను చూసి నేర్చుకోండి.. కేసీఆర్ హితభోధ

టీఆర్ఎస్ పార్టీ బ‌లోపేతానికి కావాల్సిన అన్ని ర‌కాలైన చ‌ర్య‌లు తీసుకుంటున్న  ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పుడు త‌న ఫోక‌స్ దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే అంశాల‌పై పెట్టారు. ఇప్ప‌టికే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మంత్రం జ‌పిస్తున్న గులాబీ ద‌ళ‌ప‌తి దాన్ని మ‌రింత విస్త‌రించ‌డంలో భాగంగా ఢిల్లీని షేక్ చేసే ప్లాన్ వివ‌రించారు. ఇందుకోసం త‌మిళ‌నాడు ఫార్ములాను అమ‌ల్లో పెట్టాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో డీఎంకేను ఫాలో అవ్వాల‌ని కేసీఆర్ సూచించారు.  తెలంగాణభవన్‌లో పార్టీ అధ్యక్షుడి హోదాలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వ‌హించిన సంద‌ర్భంగా ఈ పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ ఈ మాట‌లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి టీఆర్‌ఎస్ పార్టీ రక్షణ కవచం లాంటిదని ప్రజలు భావించారని, అందుకే ప్రతి ఎన్నికల్లోనూ అద్భుత విజయాలను అందిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను పొందామని, దానిని నిలుపుకోవడానికి ఇంకా బాగా పనిచేయాల్సి ఉన్నదని చెప్పారు. ఒకనాడు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఖాళీచేయించిన నాటి పరిస్థితి నుంచి.. నేడు ప్రతి జిల్లాలో శాశ్వత కార్యాలయాలు నిర్మించుకునే స్థాయికి పార్టీ ఎదిగిందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ పటిష్ఠంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, డీఎంకే మాదిరి టీఆర్‌ఎస్ తయారుకావాలని, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. తమిళనాడులో డీఎంకే పార్టీకి ప్రస్తుతం 1400 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారని కేసీఆర్ తెలిపారు. అక్కడ ఒక్కో కుటుంబం నుంచి మూడు నాలుగు తరాలు ఆ పార్టీలో పనిచేస్తారని చెప్పారు. వారు తరుచుగా పార్టీలు మారబోరని, సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం, పార్టీ స్థాపించిన లక్ష్యం కోసం పనిచేస్తారన్నారు. అందుకే అక్కడ వేరే పార్టీలకు అవకాశం లేకుండా ఆ రెండు పార్టీలే అధికారంలో ఉంటున్నాయన్నారు. డీఎంకే స్థాపించిన నాటినుంచి అంత పటిష్ఠంగా పార్టీని తయారుచేశారని తెలిపారు.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం హిందీని దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు నిబంధన పెట్టాలని భావిస్తే ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిందని, దీంతో ఒక్క రోజులోనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నదని చెప్పారు. డీఎంకే నిర్ణయానికి కేంద్రం తలవంచాల్సి వచ్చిందన్నారు. అంత పటిష్ఠంగా డీఎంకే అక్కడ పాతుకుపోయిందని, దానికి సిద్ధాంతపరమైన క్యాడర్ ఉన్నదని తెలిపారు. డీఎంకే పార్టీకి అక్కడ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.6 వేల కోట్ల ఆస్తులున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. త‌మిళ తంబీల ఫార్ములాతో ఢిల్లీని వ‌ణికించాల‌నే కేసీఆర్ ఎత్తుగ‌డ ఎంత  మేర‌కు ఫ‌లితం ఇస్తుందో...వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English