జగన్‌కు కత్తి మీద సాము.. కొత్త జిల్లాలు

 జగన్‌కు కత్తి మీద సాము.. కొత్త జిల్లాలు

ఏపీలోని 13 జిల్లాలు 25 జిల్లాలవుతాయని వైసీపీ నేతలు పదేపదే చెబుతున్నారు. చిన్నపాటి మార్పుచేర్పులతో ప్రతి పార్లమెంటు స్థానాన్ని జిల్లా చేస్తామంటున్నారు. అయితే.. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం వైసీపీలో కాక రేపుతోందట. దీనిపై నేతల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదని.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని టాక్.

తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వే పూర్తి చేశారు. ఏయే ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్న దానిపై తర్జనభర్జన పడ్డారు. చివరకు కొత్త జిల్లాల కేంద్రాలను కూడా ఎంపిక చేసినట్టు సమాచారం.

కానీ... జిల్లాల విభజనకు మాత్రం అధికార పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. లోక్‌సభ నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకుంటే తాము ప్రాధాన్యత గల ప్రాంతాలను కోల్పోవలసి వస్తుందని, దీనివల్ల పార్టీ శ్రేణుల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న అభిప్రాయాన్ని వారు వెల్లడించినట్టు సమాచారం.ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని జిల్లాలు బాగా అభివృద్ధి చెందగా, మరికొన్ని జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం గణనీయంగా విస్తరించగా, మరికొన్ని జిల్లాల్లో పారిశ్రామికంగా వెనుకబడి ఉండటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగా ఉండటం వంటి అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల తమ జిల్లాలు నష్టపోతాయని ఆయా జిల్లాల నేతలు అధినేత ముందు వాపోతున్నారు.

ముఖ్యంగా శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలను విభజించడానికి అక్కడ నేతలు సుముఖంగా లేరు. శ్రీకాకుళం జిల్లాను విభజిస్తే ఆ జిల్లాకు చెందిన ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీల పరిధిలోని మండలాలు విజయనగరం జిల్లాలో విలీనం చేయాల్సి ఉంది. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. దీంతో ఈ రెండు జిల్లాలను అక్కడ నుంచి వేరు చేయరాదని అక్కడ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

శ్రీకాకుళం జిల్లాలోని అంబేద్కర్ యూనివర్శిటీ ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉండగా, పరిశ్రమలు విస్తరించి ఉన్న కోష్ఠ, పైడిభీమవరం కూడా అదే నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఇక రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలను విలీనం చేయవద్దని అక్కడ నేతలు ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో కూడా ఆ జిల్లా విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాను విభజిస్తే మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కొందరు, చీరాలను జిల్లా కేంద్రంగా చేయాలని మరి కొందరు, ఒంగోలు కేంద్రంగా ఏర్పాటు చేయాలని మరికొందరు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. మిగతా జిల్లాల నుంచీ ఇలాంటి అభ్యంతరాలు వస్తుండడంతో కొత్త జిల్లాల ఏర్పాటు జగన్ ప్రభుత్వానికి కత్తి మీద సామే కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English