రోజాకు మరో కీలక పదవి.. ఆమెకు శ్రీలక్ష్మి అండ

రోజాకు మరో కీలక పదవి.. ఆమెకు శ్రీలక్ష్మి అండ

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత నుంచి రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గ ఏర్పాటు సమయంలో ఎన్నో మలుపులతో కూడిన రాజకీయాలు సాక్షాత్కరించాయి. వైసీపీలోని ఎంతో మంది కీలక నేతలకు తన కేబినెట్‌లో చోటు కల్పించలేదు సీఎం జగన్. మొదటి నుంచీ తన వెంట ఉన్న చెవిరెడ్డి, భూమన, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా తదితర నేతలకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశం అయింది.

 వీరిలో చెవిరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ విప్‌ పదవితో పాటు తుడా చైర్మన్‌ పదవి దక్కింది. అలాగే రోజాను ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్‌గా నియమించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ విషయం పార్టీ వర్గాలకు చెప్పి అధికారికంగా ప్రకటన చేయించారు. వాస్తవానికి రోజాకు ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కుతుందని అంతా భావించారు. ఈ పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆమె అసంతృప్తిగానే ఉన్నారు. దీంతో రోజాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో కీలక నామినేటెడ్ పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.

 తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రోజాకు ‘నవరత్నాలు’ అమలుకు సంబంధించి కీలక బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ‘నవరత్నాలు’ అమలుకు మంత్రి వర్గంలో అవకాశం రాని నేతలను ఉపయోగిస్తానని సీఎం జగన్‌ చెప్పడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్లైంది. ‘నవరత్నాలు’ అమలుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తారని, ఇందుకోసం రోజాకు మరికొందరు మహిళలు, సీనియర్ నేతలు జత కానున్నారని కూడా తెలుస్తోంది. ఇందులోనే ఐఏఎస్ శ్రీలక్ష్మీ కూడా స్థానం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

 ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో వైసీపీ అధినేత జగన్ ఎంతగానో శ్రమించారు. ఇందులో భాగంగానే ఆయన రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఇచ్చిన హామీలతో కలిపి రూపొందించినదే ‘నవరత్నాలు’. వీటి అమలు బాధ్యతను కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే నికార్సైన టీమ్‌ను సిద్ధం చేయాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ‘నవరత్నాలు’తో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తానని జగన్ గతంలో అందరికీ మాట ఇచ్చిన విషయం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English