ఫైర్ బ్రాండ్ల‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌!

ఫైర్ బ్రాండ్ల‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌!

ఆర్కే రోజా.. భూమాన క‌రుణాక‌ర్ రెడ్డి.. చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి.. గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి.. వాసిరెడ్డి ప‌ద్మ‌.. ఈ పేర్ల‌ను చ‌దువుతున్న‌ప్పుడు వీరంద‌రికి సంబంధించి కొన్ని కామ‌న్ పాయింట్లు క‌నిపిస్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరంతా ఫైర్ బ్రాండ్ నేత‌లుగా సుప‌రిచితులు. తొమ్మిదేళ్ల‌కు పైనే ప్ర‌తిపక్షంలో కూర్చున్న వేళ‌.. పార్టీ గొంతుక‌లా మారారు వీరు. ప‌లు అంశాల‌కు సంబంధించి పార్టీ ఉనికిని చాటుతూ మీడియాలో మాట్లాడేవారు.

మ‌రి.. అలాంటి నేత‌ల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌.. ఏపీ సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏం చేశార‌న్న‌ది చూస్తే ఆశ్చ‌ర్య‌క‌రంగా అనిపించ‌క మాన‌దు. స‌మీక‌ర‌ణాలు స‌రిపోలేద‌ని.. మ‌రేదో కార‌ణంతోనో.. ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ల‌కు అప్రాధాన్య పోస్టులు ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. పార్టీకి కేరాఫ్ అడ్ర‌స్ లుగా నిలిచిన ఈ నేత‌ల్లో ఒక్క‌రంటే ఒక్క‌రికి మంత్రి ప‌ద‌వి ద‌క్కింది లేదు.

చేసిన మేలును అస్స‌లు మ‌ర్చిపోర‌ని.. క‌ష్ట‌ప‌డిన వారిని నెత్తిన పెట్టుకుంటార‌ని చెప్పే జ‌గ‌న్ వైఖ‌రి వీరి విష‌యంలో మాత్రం తేడాగా ఉండ‌టం విశేషం. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమంటే.. పెద్ద‌గా ప‌రిచ‌యం లేని వారిని.. రాజ‌కీయంగా రాటుతేల‌ని నేత‌ల‌కు పెద్ద ప‌ద‌వుల్ని అప్ప‌జెప్పిన  వైనం క‌నిపిస్తుంది.

అదే స‌మ‌యంలో తాను ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా పోరాడి వారికి ప‌ప్పుబెల్లాల లాంటి పోస్టుల‌తో స‌రిపుచ్చిన వైనం చూస్తే.. ఫైర్ బ్రాండ్ నేత‌ల‌కు జ‌గ‌న్ భ‌లేగా దెబ్బేసిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. సీనియ‌ర్ల‌కు షాకులిస్తూ.. పెద్ద ఫేం లేని వారికి పెద్ద‌పీట వేసిన వైనం చూస్తే.. జ‌గ‌న్ మార్క్ భలేగా అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

బ‌లం మ‌స్తుగా ఉన్న వేళ‌.. జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా అడిగే నాథుడు ఉండ‌ని ప‌రిస్థితి. అందులోకి వైఎస్సార్ కాంగ్రెస్ లో అలా అడ‌గాల‌న్న ఆలోచ‌న వ‌స్తే ఏం జ‌రుగుతుందో తెలుసు కాబ‌ట్టి.. ఇచ్చిన దానికి తృప్తి ప‌డ‌ట‌మే మేల‌న్న భావ‌న‌తో స‌ర్దుకుపోతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఎవ‌రిని ఎలా డీల్ చేయాలో జ‌గ‌న్ కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికి తెలీదేమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English