షూటింగ్ మధ్యలో పారిపోయిన హీరోయిన్


ఒక దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తమ హీరోయిన్ సినిమా షూటింగ్ మధ్యలో ఆరుగురు వ్యక్తులతో కలిసి పారిపోయిన ఉదంతం తమను ఎంతటి ఇబ్బందులకు గురి చేసిందో చెప్పుకొచ్చాడు. అవసరం లేకున్నా.. అనవసరంగా మాట్లాడి కేసుల చిక్కుల్లో చిక్కుకున్న సదరు హీరోయిన్ ఎవరో కాదు.. తమిళ నటి మీరా మిథున్. తాజాగా ఆమె నటించిన ‘పేయ కానోమ్’ చిత్ర ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సెల్వ అనర్భరసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

తన మొదటి సినిమాతోనే ఆయనకు బోలెడన్ని అనుభవాలు ఎదురయ్యాయి. సినిమా షూటింగ్ 80 శాతం పూర్తైన సమయంలో.. తమ హీరోయిన్ మీరా మిథున్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. షూటింగ్ మరో రెండు రోజుల్లో ముగుస్తుందన్న వేళలో.. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన ఆరుగురు వ్యక్తులతో కలిసి ఆమె పారిపోయిందన్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో.. ఆమె లేకుండానే కథను మార్చి సినిమాను పూర్తి చేశామని చెప్పారు.

అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేయటం.. జైలుకు వెళ్లటం.. బెయిల్ మీద విడుదలైన తర్వాత ఆమెతో మిగిలిన షూటింగ్ పార్టును పూర్తి చేశారు. ఇంతకీ మీరా చేసిన తప్పేంటి? ఆమెను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారన్నది చూస్తే.. అదంతా ఆమె చేతులారా చేసుకున్న తప్పులేనని చెప్పాలి. దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. అవి కాస్తా సంచలనంగా మరాటం తెలిసిందే.
అక్కడితో ఆగని ఆమె.. తన వివాదాస్పద వ్యాఖ్యలపై చింతించలేదు సరికదా.. తనను పోలీసులు అరెస్టు చేయలేరని.. అలాంటిది కలలోనే జరుగుతుందని చేసిన వ్యాఖ్యలు పోలీసుల్లో పట్టుదల పెంచింది. చివరకు రంగంలోకి దిగిన తమిళనాడు పోలీసులు కేరళలో ఆమె ఉన్న చోటుకు వెళ్లి అరెస్టు చేశారు.

అరెస్టు చేసే సమయంలోనూ.. ఆమె చేసిన డ్రామా అంతా ఇంతా కాదు. తనను అరెస్టు చేస్తే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటానని.. కావాలనే తనను టార్గెట్ చేశారంటూ సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సందర్భంగా సీఎంను ఉద్దేశించి కూడా ఆమె అనవసర వ్యాఖ్యలు చేశారు. ఒక అమ్మాయి విషయంలోనే ఇలా జరుగుతుందా?నన్ను అరెస్టు చేస్తే ఇక్కడే కత్తితో పొడుచుకొని చనిపోతా. ముఖ్యమంత్రి.. ప్రధాన మంత్రులు.. తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ అనవసరమైన వ్యాఖ్యలు చాలానే చేసింది. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టు ఎపిసోడ్ నడిచింది. ఇమేజ్ కోసమో.. మరే సంచలనం కోసమో ఆమె చేసిన పనులు.. ఆమెకు మాత్రమే కాదు.. ఆమెతో సినిమా చేస్తున్న యూనిట్ కు తిప్పలు తప్పలేదు.