సుజనా సంచలన వ్యాఖ్యలు... బాబు ప్లాన్ లో భాగమేనా?

సుజనా సంచలన వ్యాఖ్యలు... బాబు ప్లాన్ లో భాగమేనా?

టీడీపీలో సీనియర్ నేతగా, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ యంత్రాంగంలో కీలక నేతగా ఉన్న వై.సుజనా చౌదరి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేపింది. ఏనాడూ పార్టీకి విరుద్ధంగా గానీ, చంద్రబాబును తప్పుబట్టినట్టుగా గానీ మాట్లాడని, అసలు అలాంటి ఆలోచనే రాని నేతగా కనిపించే సుజనా... ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవరించారు. చంద్రబాబు కారణంగానే పార్టీ ఓడిపోయిందని, చంద్రబాబును పార్టీలోని ఓ కోటరీ తప్పుదారి పట్టించిందని... ఫలితంగా ఎన్నడూ లేనంత రీతిలో ఘోర ఓటమి దక్కిందని సుజనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా ఈ తరహా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం సుజనాకు ఏం ఉందన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా వినిపిస్తోంది.

పార్టీ ఓటమిపాలైనా... తాను రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. ఈ పదవీ కాలం ముగిస్తే... ఎలాగూ ఈ దఫా టీడీపీకి ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కే ఛాన్సు లేని నేపథ్యంలో సుజనా ఇంటిపట్టునే కూర్చోక తప్పదు. అయినా ఇప్పటికిప్పుడు సుజనాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు గానీ... ఉన్నట్టుండి ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన సందర్భంగా తనదైన శైలికి భిన్నంగా వ్యవహరించిన సుజనా... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విన్నంతనే సుజనా టీడీపీని వీడుతున్నారని, త్వరలోనే ఆయన బీజేపీలో చేరిపోతారని కూడా వదంతులు వినిపించాయి. అయితే పార్టీ మారే విషయాన్ని కూడా చివరాఖరుగా చెప్పిన సుజనా... తాను పార్టీ మారడం లేదని, ఒకవేళ మారితేగీరితే.. చంద్రబాబుకు చెప్పే మారతానని కూడా చెప్పేశారు.

సో... పార్టీని ఇబ్బందులకు గురి చేసినట్టుగా మాట్టాడినా కూడా సుజనా పార్టీ మారడం లేదన్న మాట. మరి సుజనా ఎందుకిలా పార్టీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు? ఇదంతా చంద్రబాబు గేమ్ ప్లానేనన్న కొత్త మాట వినిపిస్తోంది. పార్టీ ఓటమి నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటి దాకా పార్టీని కాపాడుకోవడం, నేతలను కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. అలాంటి వ్యూహంలో భాగంగానే చంద్రబాబు ఓ ప్లాన్ ను సిద్ధం చేశారని, అందులో భాగంగానే సుజనా చౌదరి గతానికి బిన్నంగా మాట్లాడారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మరి ఆ వ్యూహం ఏమిటో? ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English