సిక్సులతోనే సెంచరీ.. ప్రపంచకప్‌లో అరుదైన రికార్డు

సిక్సులతోనే సెంచరీ.. ప్రపంచకప్‌లో అరుదైన రికార్డు

ఇంగ్లండ్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఏమాత్రం మజాను పంచడం లేదు. కొద్దిరోజులుగా ఆ దేశంలో వర్షాలు పడుతుండడంతో చాలా మ్యాచ్‌లు రద్దవగా, కొన్నింటికి ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రపంచకప్ చూసే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. మొన్న భారత్ - పాక్ మధ్య హైటెన్షన్ మ్యాచ్ ఉంటుందని భావించినా.. అది కాస్తా ఏకపక్షం అవడంతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. ఇలాంటి తరుణంలో ఇంగ్లండ్‌లో మరోసారి వర్షం కురిసింది. అయితే, ఇది మామూలు వర్షం కాదు.. సిక్సర్ల వర్షం. ఈ వర్షాన్ని కురిపించింది మరెవరో కాదు.. ఆతిథ్య జట్టు కెప్టెన్ మోర్గాన్.

 అవును.. మీరు చదవింది నిజమే. మంగళవారం ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రెచ్చిపోయాడు. కొద్దిరోజులుగా పరుగుల దాహంతో ఉన్న అతడు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా తన జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తంగా 71 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, 17 సిక్సర్లతో 148 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడానికి బాటలు వేశాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ధాటికి ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. ముఖ్యంగా అతడు సాధించిన ఓ రికార్డు క్రికెట్ చరిత్రను తిరగ రాసింది.

 ఈ మ్యాచ్‌లో మోర్గాన్ 17 సిక్సర్లు కొట్టడంతో ఒక వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర కెక్కాడు. గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. వెస్టిండీస్‌తో మ్యచ్‌లో 16 సిక్సులు కొట్టి 149 పరుగులు సాధించాడు. ఆ తర్వాత క్రిస్ గేల్ 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై 16 సిక్సులు బాది తన కెరీర్‌లో ఉత్తమ స్కోర్ 215 పరుగలు సాధించాడు. గతంలో రోహిత్ కూడా 16 సిక్సర్లు కొట్టాడు. వీళ్లందరి రికార్డును మోర్గాన్ దాటేశాడు. అంతేకాదు, అతడు కేవలం సిక్సర్ల ద్వారానే 102 పరుగులు సాధించడం విశేషం.

 57 బంతుల్లోనే సెంచరీ సాధించిన మోర్గాన్.. వరల్డ్ కప్‌లో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. అప్ఘాన్ బౌలర్లను ఊచకోత కోసిన మోర్గాన్.. వన్డేల్లో 200 సిక్స్‌లను ఖాతాలో వేసుకున్నాడు. మోర్గాన్ ధాటికి ప్రపంచ మేటి బౌలర్ రషీద్ ఖాన్ సైతం పది ఓవర్ల తన కోటాలో తొమ్మిది ఓవర్లు మాత్రమే వేసి 110 పరుగులు సమర్పించుకున్నాడు. వరల్డ్ కప్‌లో అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శన ఇదే. ఇక, మొత్తంగా రూట్, బెయిర్ స్టో, మొయీన్ అలీ రెచ్చిపోవడం ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English