బీజేపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీ.. పార్టీ విలీనం చేస్తానంటూ ప్రకటన

బీజేపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీ.. పార్టీ విలీనం చేస్తానంటూ ప్రకటన

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలవడంతో రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయాలు పురుడు పోసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దీంతో ఇక్కడ బలపడడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. గత ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోని ఆ పార్టీ టీడీపీతో పాటు ఇతర పార్టీల నాయకులకు వల వేస్తోంది. తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతోంది.

 దీంతో త్వరలోనే భారతీయ జనతా పార్టీలోకి వలసలు భారీగా ఉండబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. తాజాగా వైసీపీ మాజీ ఎంపీ, జన జాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత ఆ పార్టీలో చేరారు. మంగళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన ఆమె.. కాషాయ కండువా కప్పుకున్నారు. ఏపీలో వైసీపీకి ప్రత్యమ్నాయం బీజేపీయేనని చెప్పిన ఆమె.. పార్టీ బలపడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. అంతేకాదు, తాను స్థాపించిన జన జాగృతి పార్టీని త్వరలో బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు.

 వాస్తవానికి కొత్తపల్లి గీత 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. గతంలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేసిన ఆమెకు జగన్ పోటీ అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయాల దృష్ట్యా కొత్తపల్లి గీత వైసీపీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆమెను చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో ఆసక్తి చూపారు. ఆమె కూడా టీడీపీలోకి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తర్వాత ఏమైందో ఏమో ఆమె సైలెంట్ అయిపోయారు.

 ఇక, గత సంవత్సరం జన జాగృతి అనే పార్టీని స్థాపించి కలకలం సృష్టించారు. మార్పు కోసం ముందడగు నినాదంతో ఈ పార్టీని ప్రారంభించినట్లు ఆమె చెప్పారు. చిహ్నంగా గొడును నిర్ణయించగా.. జెండా బులుగు, నీలం రంగులో ఉంది. ప్రజల కోసమే పార్టీలు పుట్టుకొస్తాయన్నారు ఎంపీ గీత. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆమెతో పాటు తన పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. కానీ, ఏ ఒక్కరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు. తన పార్టీ మనుగడ కష్టం అనే ఆలోచనకు వచ్చిన ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English