టీడీపీని ఖాళీ చేసేందుకు జగన్ అటు నుంచి నరుక్కొస్తారట

టీడీపీని ఖాళీ చేసేందుకు జగన్ అటు నుంచి నరుక్కొస్తారట

‘చంద్రబాబు మాదిరిగా ప్రలోభాలు పెట్టి.. మంత్రి పదవులు ఇస్తానని ఆశ పెట్టి ఉంటే.. తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కి ఉండేది కాదు. అయినా.. మా పార్టీలోకి ఎవరైనా రావాలి అంటే తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే తీసుకుంటాం. అలా కాకుండా మేము వాళ్లను తీసుకుంటే.. వెంటనే అనర్హత వేటు వేసినా అభ్యంతరం చెప్పం. పార్టీ ఫిరాయింపులనే ఈ అన్యాయమైన సంప్రదాయం కొనసాగవద్దు. చట్టసభలో ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్ష సభ్యులు కొనసాగాలి. పరిస్థితులు పూర్తిగా మారిపోయి కొత్త సంప్రదాయం రావాలి’’ ఇవీ.. నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.

 వలసలను ప్రోత్సహించం అని ఆయన స్పష్టం చేసేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది ఆశావాహులు నిరుత్సాహానికి గురవగా, ఆ పార్టీ అధిష్ఠానం మాత్రం సంతోష పడింది. అయితే, ఈ సంతోషాన్ని ఎక్కువ కాలం నిలవనివ్వకూడదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలోకి వలసలు ప్రోత్సహించం అని చెప్పినప్పటికీ, టీడీపీ వాళ్లను భారతీయ జనతా పార్టీలో చేర్చేందుకు కొందరు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా చేయడం వల్ల టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుందని ఆ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 వాస్తవానికి వైసీపీ కాకపోతే రాష్ట్రంలో ప్రత్యమ్నాయం బీజేపీనే. గతంలో ఆ పార్టీలోకి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడకపోయినా.. ఇప్పుడు వాళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని కూడా బీజేపీ అధిష్ఠానం పట్టుదలతో ఉంది. దీనిని క్యాష్ చేసుకోవడం వల్ల పరోక్ష మిత్రపక్షం బీజేపీకి వైసీపీ మేలు చేసినట్లు అవుతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయవచ్చు. అందుకే వైసీపీ నేతలు దగ్గరుండి మరీ టీడీపీ వాళ్లతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. చాలా మంది బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారని సమాచారం.

 వాస్తవానికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కలిగి ఉండాలంటే మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు సాధించి ఉండాలి. ప్రస్తుతం టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పది శాతం అంటే టీడీపీకి 18 మంది సభ్యులు ఉంటే సరిపోతుంది. అయితే ఓ ఆరుగురు ఎమ్మెల్యేలు ఏవేవో కారణాలు చెప్పి తమ పదవులకు రాజీనామా చేసి, టీడీపీకి గుడ్ బై చెప్పారంటే ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. ఐతే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలు ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకుంటారా అంటే బయటకు చెప్పకపోయినా కొందరు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English