ఏపీ ప్రభుత్వం తారక్‌ను వాడుకోబోతుందా..?

ఏపీ ప్రభుత్వం తారక్‌ను వాడుకోబోతుందా..?

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలనే పట్టుదలతో పని చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ఆయన ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రస్తుతం లోటు బడ్జెట్‌లో ఉంది.. అదీగాక ఎంతో ఆదాయం ఇచ్చే మద్యాన్ని నిషేదిస్తామని ఆయన ప్రకటించారు. దీంతో ఏపీకి ఆదాయ వనరులను అన్వేషించడం ముఖ్యమంత్రికి సవాలుగా మారింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందా..? లేదా..? అన్నది పక్కనపెడితే స్వయంగా రాబడి పెంచుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 అందుకోసం ఏపీకి ఆదాయాన్ని అందించే ఏ అవకాశాన్నీ వదులుకోరాదని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం తన కేబినెట్‌లో ఉన్న మంత్రులందరికీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటకం సహా రాష్ట్రంలోని అన్ని రంగాలకు అంబాసీడర్‌లను నియమించాలని ముఖ్యమంత్రికి కొందరు సలహా ఇచ్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏదైనా ఒక దానికి జూనియర్ ఎన్టీఆర్‌ను నియమించాలని కూడా పలువురు సూచించారని సమాచారం. ఈ మేరకు ఏపీ సీఎం తర్జనభర్జన పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 అయితే, అతడిని సంప్రదించడం ఎలా..? ఒకవేళ అడిగినా తారక్ ఒప్పుకుంటాడా..? అన్న దానిపైనా పార్టీ అంతర్గత సమావేశంలో చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వాస్తవానికి ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రభుత్వానికి ఎటువంటి సహకారం అందించని తారక్.. దానిని ఓడించి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తారా అంటే అనుమానమే. అయితే, అధికార పార్టీలోని మంత్రి కొడాలి నాని, తారక్ మామ నార్నే శ్రీనివాస్ ఒత్తిడి తెస్తే చిన్న రాముడు ఒప్పుకునే అవకాశాలూ లేకపోలేదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 తన తాత పెట్టిన పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్న ఉద్దేశ్యంతో 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖాకీ వస్త్రాలు ధరించి, చైతన్య రథంపై నలుమూలలా తిరుగుతూ తన తాత నందమూరి తారక రామారావును గుర్తు చేశాడు. జూనియర్ ప్రచారానికి భారీ స్పందన కూడా వచ్చింది. కానీ, అప్పుడు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అప్పటి నుంచి అతడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. దీంతో చంద్రబాబుకు, తారక్‌కు మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే.

 దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం కావడంతో అంబాసీడర్‌లు అంటూ డబ్బులు ఖర్చు పెట్టడం అనవసరం అని కొందరు అంటున్నారు. కోట్లాది రూపాయలు చెల్లించి అంబాసీడర్లను నియమించినా.. వారిని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే.. రాష్ట్రానికి జగన్ ఫొటో చూసే ఆదాయం పెరిగిపోతుందని, మరో అంబాసీడర్ అవసరం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English