ఆవులించాడు.. నేషనల్ విలనయ్యాడు

ఆవులించాడు.. నేషనల్ విలనయ్యాడు

పాపం పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫ్‌రాజ్ ఖాన్. ఆవులింత ఆపుకోలేని బలహీనత ఇప్పుడతడిని నేషనల్ విలన్ని చేసింది. పాకిస్థాన్ జనాలు ఇప్పుడు అతడి పేరెత్తితే మండిపోతున్నారు. క్రికెట్ ప్రపంచమంతా కళ్లప్పగించి చూసే మ్యాచ్‌లో అతను ఆవులించడం.. నిద్ర ముఖం వేసుకుని కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. నిన్నటి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ చివర్లో వర్షం వల్ల ఆటకు అరగంట అంతరాయం ఏర్పడింది.

ఇన్నింగ్స్ అయ్యాక ఆటగాళ్లకు ఇవ్వాల్సిన భోజన విరామం అప్పుడే ఇచ్చేసినట్లున్నారు. బాగా లాగించి వచ్చాడో ఏమో తెలియదు కానీ.. తిరిగి మైదానంలోకి రాగానే నిద్ర ముఖంతో కనిపించాడు సర్ఫ్‌రాజ్. ఒకసారి మోకాళ్ల కిందికి వంగి ముఖం కూడా వేలాడేశాడు. తర్వాత ఆవులించాడు. ఈ దృశ్యాలు కెమెరా కంటికి దొరికిపోయాయి. నిమిషాల్లో సోషల్ మీడియాలోకి వచ్చేశాయి.

ఇక చూడాలి సామిరంగా. కుప్పలు కుప్పలుగా కామెడీ మీమ్స్ వచ్చి పడిపోయాయి. అసలే పాకిస్థాన్ పరిస్థితి అప్పటికి బాగా లేదు. భారత బ్యాట్స్‌మెన్ పాక్ బౌలింగ్‌ను ఉతికారేసి భారీ స్కోరు సాధించారు. పాక్ ఓటమి అప్పటికే ఖరారైపోయింది. ఐతే ఎంతో ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో పాక్ పరిస్థితి ఏమంత బాగా లేనపుడు టెన్షన్ పడకుండా.. సర్ఫ్‌రాజ్‌ తాపీగా ఆవులించడం ఏంటంటూ పాకిస్థాన్ అభిమానులే అతడిపై మండిపడ్డారు.

చివరికి పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోవడంతో సర్ఫ్‌రాజ్ ఆవులింతలు మరింతగా హైలైట్ అయ్యాయి. అటువైపు కోహ్లి ఫెరోషియస్ ఉండగా.. ఇటువైపు సర్ఫ్‌రాజ్ లాంటి కెప్టెన్ ఉంటే పాకిస్థాన్ ఎక్కడ గెలుస్తుందంటూ సొంత అభిమానులే అతడిపై దుమ్మెత్తి పోశారు. కెప్టెన్‌గానే కాక.. బ్యాట్స్‌మన్‌గానూ సర్ఫ్‌రాజ్ విఫలం కావడంతో అతడిపై పాకిస్థాన్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English