భర్తతో సానియా ఇక ఫుల్ టైం

భర్తతో సానియా ఇక ఫుల్ టైం

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెళ్లయి తొమ్మిదేళ్లు అవుతోంది. ఇప్పటిదాకా భర్త షోయబ్‌ మాలిక్‌తో వరుసగా రెండు నెలలు కలిసి ఉన్నది లేదు. ఆమె టెన్నిస్‌లో బిజీ. భర్తేమో క్రికెట్లో తీరిక లేకుండా ఉన్నాడు. మధ్యలో ప్రెగ్నెన్సీ వల్ల ఒక ఏడాదిన్నర మినహాయిస్తే సానియా టెన్నిస్‌కే అంకితం అయి ఉంది. మాలిక్ వయసు మీద పడుతున్నప్పటికీ క్రికెట్‌ను విడిచిపెట్టలేదు. ఓవైపు దేశానికి ఆడుతూనే.. మరోవైపు వివిధ టీ20 లీగ్స్‌లో కొనసాగుతూ వచ్చాడు. పాకిస్థాన్ జట్టులోకి చాలామంది ఆటగాళ్లు వచ్చారు. వెళ్లారు. కానీ మాలిక్ మాత్రం 37 ఏళ్ల వయసులోనూ జట్టులో కొనసాగడం ఆశ్చర్యకరం. ఐతే ఇన్నాళ్లూ కొంచెం ఫామ్ అటు ఇటుగా ఉన్నప్పటికీ మాలిక్‌ను పాకిస్థాన్ జట్టులో కొనసాగిస్తూ వచ్చారు. ఈసారి ప్రపంచకప్‌లో అతను జట్టుకు ఉపయోగపడతాడని ఆశించారు.

కానీ ఈ టోర్నీలో మాలిక్ ఘోరంగా విఫలమయ్యాడు. ముందు మ్యాచ్‌ల సంగతెలా ఉన్నా భారత్ మీద మంచి రికార్డుంది కాబట్టి ఆ మ్యాచ్‌లో మాలిక్ చెలరేగి జట్టును గెలిపిస్తాడని ఆశించారు పాక్ అభిమానులు. కానీ మాలిక్ ఈ మ్యాచ్‌లో ఆడింది ఒక్కటంటే ఒక్క బంతి. హార్దిక్ పాండ్య వేసిన బంతిని వికెట్ల మీదికి ఆడుకుని డకౌటయ్యాడు మాలిక్. బౌలింగ్‌లోనూ అతడి వైఫల్యమే. పాక్ ఘోర పరాభవానికి ముఖ్య కారకుల్లో ఒకడిగా అతడిని చూస్తున్నారు ఫ్యాన్స్. అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహుశా మాలిక్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చేమో. అతడికి మళ్లీ పాక్ తరఫున ఆడే అవకాశం రాకపోవచ్చు. పాకిస్థాన్ ప్రపంచకప్‌లో సెమీస్ చేరే అవకాశాలు దాదాపుగా లేవు.

భారత్ చేతిలో చిత్తుగా ఓడారు. పైగా సెమీస్ చేరట్లేదు. ఇక మాలిక్ సహా పాకిస్థాన్ క్రికెటర్లు ఇప్పుడిప్పుడే స్వదేశానికి వెళ్లే పరిస్థితి ఉండదు. ఈ ఫాంతో మాలిక్ ఇక టీ20 లీగ్స్‌లోనూ కొనసాగకపోవచ్చు. మొత్తంగా అతను క్రికెట్‌కు టాటా చెప్పడం లాంఛనమే. మాలిక్, సానియాలకు రెండో ఇల్లుగా ఉన్న దుబాయ్‌లో ఇద్దరూ సెటిల్ కావడమే తరువాయి. సానియా కెరీర్‌ కూడా ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఇద్దరూ ఇక ఫుల్ టైం భార్యాభర్తలుగా కొనసాగొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English