టీడీపీ రెడ్డి నేతలను కాపాడుకోవడం చంద్రబాబుకు కత్తిమీద సామే

టీడీపీ రెడ్డి నేతలను కాపాడుకోవడం చంద్రబాబుకు కత్తిమీద సామే

తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజికవర్గ పార్టీ అనే ముద్ర ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాంతంలో ఆ పార్టీకి రెడ్ల మద్దతు కూడా ఉండడంతో గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు నేలన తనదైన ముద్ర వేసింది. కానీ, మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఆ పార్టీ నుంచి రెడ్డి నేతలెవరూ ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాలేదు. శాసనసభకు కానీ, లోక్ సభకు కానీ టీడీపీ నుంచి రెడ్డి నేత అన్నవారెవరూ గెలవకపోవడంతో రాష్ట్రంలోని రెడ్లు తమ సామాజికవర్గ నేతలు ఆ పార్టీలో ఉండాలని కోరుకోవడం లేదా అన్న ప్రశ్న మొదలైంది. ఈ అనూహ్య పరిణామం అటు టీడీపీలోని రెడ్డి నేతలను, టీడీపీ అగ్రనేతలనూ ఆందోళనకు గురిచేస్తోంది.

తాము టీడీపీలో ఉండడాన్ని తమ సామాజికవర్గం ఇష్టపడడం లేదన్న సత్యాన్ని ఈ ఎన్నికలు రుజువు చేశాయని.. రాజకీయాలకు, కులానికి అవినాభావ సంబంధం ఏర్పడిపోయిన ఈ తరుణంలో కులాన్ని కాదని రాజకీయాలు చేయలేం కాబట్టి తాము టీడీపీని వీడక తప్పదని పలువురు నేతలు ఇప్పటికే విశ్లేషించుకుంటున్నారట.

అదేసమయంలో పార్టీలోని రెడ్డి నేతలు ఈ తరహా ఆలోచనలకు వచ్చే ప్రమాదముందని గ్రహించిన పార్టీ అగ్రనాయకత్వం కూడా ఈ సంక్షోభ నివారణకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రాయలసీమ ప్రాంతంలోని బలమైన రెడ్డి నేతకు ప్రాధాన్యమిచ్చి ఆ సామాజికవర్గాన్ని పార్టీతో ఉంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

టీడీపీలో భూమా కుటుంబం, బైరెడ్డి రాజశేఖరరెడ్డి, సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, వరదరాజుల రెడ్డి వంటి సీనియర్ నేతలున్నప్పటికీ ఆ సామాజికవర్గం మాత్రం మొన్నటి ఎన్నికల్లో పార్టీని తిరస్కరించింది.

మరోవైపు ఇప్పటికే భూమా అఖిలప్రియ మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారని.. జగన్‌తో చర్చలకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో  పార్టీలోని రెడ్డి నేతలను చంద్రబాబు ఎంతవరకు కాపాడుకోగలరన్నది ప్రశ్నగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English