కేసీఆర్‌కు జ‌గ‌న్ గిఫ్ట్ అందేది నేడే

కేసీఆర్‌కు జ‌గ‌న్ గిఫ్ట్ అందేది నేడే

ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించిన వెంట‌నే..ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇస్తున్న గిఫ్ట్‌గా హైద‌రాబాద్‌లోని స‌చివాల‌య భ‌వ‌నాల‌ను పేర్కొన‌వ‌చ్చు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రభుత్వానికి హైదరాబాద్‌లో కేటాయించిన భవనాలను తిరిగి అప్పగించనున్నట్టు ఏపీ అధికారులు.. తెలంగాణ అధికారులకు స్పష్టంచేశారు. సచివాలయంలోని పలు బ్లాకులతోపాటు, ఏపీ డీజీపీ కార్యాలయ భవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లను తెలంగాణకు అప్పగించనున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి  సోమవారం విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తున్న త‌రుణంలో...ఈ అప్ప‌గింత తంతు పూర్తికావ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవల ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న భవనాలు అవసరం లేదని భావించింది. ఈ మేరకు తెలంగాణకు అప్పగించడానికి ముందుకువచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చొరవ తీసుకొని ఏపీలో కొత్తగా ఏర్పడిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి స్నేహహస్తం అందించారు. తెలంగాణ ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. హైదరాబాద్‌తో తమకు అవసరం లేదని భావించి భవనాలను అప్పగించడానికి ముందుకువచ్చారు. దీంతో సచివాలయంతోపాటు ఇతర భవనాల అప్పగింత ప్రక్రియ వేగం అందుకుంది. మ‌రోవైపు ఏపీ ప్రభుత్వానికి రెండు భవనాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన తెలంగాణ.. అసెంబ్లీ ఎదురుగా ఉన్న హెర్మిటేజ్ భవనం, ఏసీ గార్డ్స్‌లోని సీఐడీ భవనాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ మేరకు ఆయా భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను ఇతర భవనాల్లోకి తరలిస్తున్నారు. హెర్మిటేజ్ భవనంలో ఉన్న కార్యాలయాల తరలింపు దాదాపు పూర్తికావచ్చింది. త్వరలో ఆ భవనాలను ఏపీకి అప్పగిస్తారు.

అయితే, ఏపీకి చెందిన స‌చివాల‌యంలోని భవనాలను ఖాళీ చేయడానికి ఏపీ అధికారులు సిద్ధంగా ఉన్నా.. ఇక్కడి సామగ్రి, ఫైళ్లను ఎక్కడకు పంపించాలనే దానిపై అమరావతిలో ఉన్న అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో ఆలస్యమవుతోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంలో స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. సచివాలయంలో ఏపీకి కేటాయించిన కే బ్లాక్‌లో పోస్టాఫీస్, బ్యాంకు, వైద్యశాల ఉన్నాయని, దీంతో ఈ బ్లాక్‌ను తెలంగాణకు అప్పగించినట్టేనని ఏపీ అధికారులు తెలిపారు. ఎల్ బ్లాక్, జే బ్లాక్‌లతోపాటు హెచ్ సౌత్‌బ్లాక్‌ను సోమవారం సాయంత్రం వరకు అప్పగిస్తామని పేర్కొన్నారు. హెచ్ నార్త్‌బ్లాక్‌లో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉంది. హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ఇతర శాఖాధిపతుల కార్యాలయాల భవనాలను కూడా అప్పగించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఏపీ డీజీపీ కార్యాలయం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్ తెలంగాణ చేతికి రానున్నాయి. అయితే ఎర్రమంజిల్‌లో ఉన్న సాగునీటి పారుదలశాఖ కార్యాలయాల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English