బాబడిగినా, జగనడిగినా... బీజేపీది అదేమాట

బాబడిగినా, జగనడిగినా... బీజేపీది అదేమాట

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ పాత వైఖ‌రితోనే ఉంది. ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా కోసం ప్ర‌య‌త్నం చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ముఖ్యమంత్రి ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి పూర్తి మ‌ద్ద‌తు ఉన్న నేప‌థ్యంలో ఒత్తిడి చేయ‌లేమ‌ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే, కార‌ణాలు ఏమైనా కావ‌చ్చు కానీ...ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంలో బాధ్యులు, ఆ పార్టీకి చెందిన నేత‌లు ప్ర‌త్యేక హోదా ఇచ్చే చాన్సే లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్తున్నారు. కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రి జి.కిష‌న్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్ రావు ఇదే మాట‌ను విజ‌య‌వాడ గ‌డ్డ‌పై చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

హైద‌రాబాద్‌లోని త‌న నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన పాద‌యాత్ర సంద‌ర్బంగా కేంద్ర హోం శాఖ స‌హా మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పారు. ఈ విష‌యంలో రాజ‌కీయ‌ పార్టీలు రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌టం కాకుండా స‌రైన రీతిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కోరారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభజన హామీల పరిష్కారానికి త‌నవంతు కృషి చేస్తానని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్, జగన్..విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

ఇక‌, బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విజయవాడలో మీడియాతో చిట్ చాట్లో భాగంగా  ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయమే అని స్ప‌ష్టం చేశారు. ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో.. వారికేం ఇవ్వాలో మాకు తెలుసని అన్నారు. బీజేపీకి 250 సీట్ల కంటే ఎక్కువ రాకూడదని కోరుకున్న జగన్ మాకు మిత్రుడెలా అవుతారని ముర‌ళీధ‌ర్ రావు ప్ర‌శ్నించారు. ఏపీలో ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. జ‌గ‌న్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తేనే.. ఇతరులు త‌మ వద్దకు వస్తారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ బలమైన శక్తిగా అవతరించబోతోందని ఆయ‌న జోస్యం చెప్పారు.

ఏపీలోనూ టీడీపీకి చెందిన వివిధ స్థాయి నేతలు త‌మ‌ పార్టీతో టచ్ లో ఉన్నారని ముర‌ళీధ‌ర్ రావు వ్యాఖ్యానించారు. చాలా రాష్ట్రాల్లో డిపాజిట్లు లేకున్నా.. అధికారం చేజిక్కించుకున్నాం.. ఏపీలోనూ అలాగే ఉంటుంది అని మురళీధర్ రావు అన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో టీడీపీది సహజ ఓటమి కాదని అభివర్ణించారు. గెలుపొటముల లెక్కలో ఈ ఓటమిని చూడకూడదని తెలిపారు. భనిష్యత్తులో కొత్త రాజకీయాలకు తెర లేచేందుకు టీడీపీ ఓటమి ఆస్కారమిచ్చిందని ఆయన అన్నారు. పాత తరం కాంగ్రెస్ నేతలంతా బీజేపీ వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని బలమైన నేతలు బీజేపీలోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English