కాంగ్రెస్ అధ్యక్షుడిగా మన్మోహన్ సింగ్

కాంగ్రెస్ అధ్యక్షుడిగా మన్మోహన్ సింగ్

మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా ఇంకా ఆమోదం పొందనప్పటికీ.. ఆయన మాత్రం కొంచెం కూడా వెనక్కు తగ్గలేదని.. పార్టీ పగ్గాలు వదిలేయడానికే నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో.. అన్ని ప్రయత్నాలూ చేసి విఫలం కావడంతో పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోక తప్పదని సోనియా నుంచి సీనియర్లకు సంకేతాలు అందాయని దిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే.. పార్టీ అధ్యక్ష పదవికి ఎవరికి ఇవ్వాలనే విషయంలోనూ క్లారిటీ లేదు. పార్టీలో ఎన్నో విభేదాలు ఉండడంతో ఈ సమయంలో ఎవరికి ఇచ్చినా మిగతావారి నుంచి ఇబ్బందులుంటాయని.. అసలే గెలుపన్నది లేకుండా నానా కష్టాలు పడుతున్న సమయంలో కొత్తగా సీనియర్ నేతల నుంచి సహాయ నిరాకరణ కూడా మొదలైతే పార్టీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుందన్న భయం కూడా పార్టీ పెద్దల్లో ఉందట.

దీనికి పరిష్కారంగా.. వివాద రహితుడు, సౌమ్ముడు అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను పార్టీ అధ్యక్షుడిని చేయాలన్న ప్రతిపాదన ఒకటి పార్టీలో వచ్చినట్లుగా సమాచారం. మెతక మనిషిగా పేరున్నప్పటికీ రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసినట్లే.. అధ్యక్ష స్థానంలో ఉంటూ సోనియా, రాహుల్ ఇష్టాలకు అనుగుణంగా పార్టీని నడిపించగలరని భావిస్తున్నారు.

మరోవైపు మన్మోహన్ రాజ్యసభ సభ్యత్వం కూడా ముగిసింది. ఆయన్ను రాజ్యసభకు పంపించాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం అవకాశం కనిపించడం లేదు. దీంతో మన్మోహన్‌ను పార్టీ అధ్యక్షుడిని చేసి ఆయనకు సహాయంగా కమిటీల్లో బలమైన నేతలను తీసుకుని కథ నడిపించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English