పెళ్లి చేసుకుంటే రాహుల్ కష్టాలు తీరుతాయట..

పెళ్లి చేసుకుంటే రాహుల్ కష్టాలు తీరుతాయట..

వైఫల్యాల రాహుల్ గాంధీకి అందరూ సలహాలు ఇచ్చేవారే. తాజాగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కూడా రాహుల్‌కు ఓ సలహా పడేశారు. పెళ్లి చేసుకుంటే ఫేట్ మారుతుందేమో.. కాస్త ట్రై చేయరాదూ అని సలహా ఇచ్చారు. పెళ్లి చేసుకుంటే రాహుల్ మరింత దృఢంగా రాటుదేలుతారని... వచ్చే ఎన్నికల నాటికైనా రాహుల్ గట్టిపడాలంటే పెళ్లి చేసుకోవడాన్ని మించిన మార్గం లేదని అథవాలే అన్నారు. రాహుల్ తనకు మంచి స్నేహితుడని.. కాబట్టే స్నేహితుడి కోసం ఈ సలహా ఇస్తున్నానని చెప్పారు.

రాహుల్ మొన్నటి ఎన్నికల్లో చాలా కష్టపడ్డారని.. కాళ్లరిగేలా ప్రచారంలో తిరిగారని.. కానీ, చివరకు మోదీ అధికారంలోకి వచ్చారని అథవాలే అన్నారు. రాహుల్ రాటుదేలాలంటే పెళ్లి చేసుకోవాలని అన్నారు. అయితే.. రాహుల్ పెళ్లి గురించి గతంలోనూ పలువురు ప్రశ్నించినప్పుడు ఆయన తాను కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకున్నానని చెప్పేవారు.

రెండోసారి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అథవాలే ఇటీవల అందరికీ సలహాలు ఇస్తున్నారు. జగన్ సీఎం అయిన తరువాత కూడా ఆయనకూ ఇలాగే సలహాలిచ్చారు.  చంద్రబాబు చేసిన తప్పు చేయొద్దంటూ జగన్‌‌కి సలహా ఇచ్చారు.  ఎన్డీయేతో సఖ్యతగా మెలగాలని ఆయనకు సూచించారు.  ఎన్డీయేను వ్యతిరేకించొద్దని చంద్రబాబుకు తాను చెప్పానని, అయినా ఆయన ఎన్డీయేకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తిరిగారని తెలిపారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారన్నారు. అలాంటి తప్పు జగన్‌ చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి కూడా పెళ్లి చేసుకుని బాగుపడమని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English