కాస్త ఈ ప‌ని చేయ్ జ‌గ‌న్‌...తెలంగాణ మంత్రి రిక్వెస్ట్‌

కాస్త ఈ ప‌ని చేయ్ జ‌గ‌న్‌...తెలంగాణ మంత్రి రిక్వెస్ట్‌

తెలంగాణ‌, ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య గ‌త కొద్దికాలంగా కొత్త సంబంధాలు తెర‌మీద‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ముంద‌స్తు ఎన్నిక‌ల స‌మ‌యంలో కుదిరిన వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దోస్తీ....ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత మ‌రింత బ‌ల‌పడింది. ఆయా రాష్ట్రాల్లో చేప‌ట్టే కార్య‌క్ర‌మాలకు ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ప‌ర‌స్ప‌రం విచ్చేయ‌డం ద్వారా ఈ బంధం బ‌ల‌ప‌డిన నేప‌థ్యంలో...తెలంగాణ మంత్రులు ఓ అడుగు ముందుకు వేస్తున్నారు. త‌మ‌కు కాస్త ఈ ప‌ని చేసి పెట్ట‌రూ అంటూ..ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు లేఖ‌లు రాస్తున్నారు.

ఔను. ఏపీలో ప‌ని అయ్యేందుకు...ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నేరుగా తెలంగాణ మంత్రులు ట‌చ్‌లోకి వెళ్తున్నారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య దోస్తీ బాగున్న నేప‌థ్యంలో..తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కీల‌క అడుగు వేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఓ లేఖ రాశారు. ప్ర‌తిష్టాత్మ‌క‌ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో హుజూరాబాద్‌కు చెందిన దొంత రమేష్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించాలని కోరారు. రాష్ట్రానికి చెందిన భక్తులకు 18 ఏళ్లుగా రమేష్ తిరుమలలో సేవ చేస్తున్నారని ఈటెల తెలిపారు. టీటీడీ బోర్డు అభివృద్ధితోపాటు భక్తులకు సేవ చేయడంలో ఆయన ముందుంటారని వివరించారు.

కాగా, ఏపీ ముఖ్య‌మంత్రికి తెలంగాణ మంత్రి నేరుగా లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ కోటాలో టీటీడీ స‌భ్యులుగా ఒక‌రిద్ద‌రికి అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌నే నేప‌థ్యంలో...ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేసుకుంటున్నారు. ఇందులో ఏకంగా తెలంగాణ మంత్రి ఏపీ సీఎంకు లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ లేఖ‌పై ఏపీ సీఎం ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English