డిప్యూటీ సీఎం మాట... అవినీతి పాలన అందిస్తారట

డిప్యూటీ సీఎం మాట... అవినీతి పాలన అందిస్తారట

రాజకీయాల్లో అనుభవం లేకున్నా... పరిణతి లేకున్నా ఇట్టే బుక్కైపోవడం ఖాయమే. అనుభవమైనా ఉండాలి... లేదంటే కాస్తంత పరిణతి అయినా ఉండాలి. అప్పుడే రాజకీయాల్లో రాణిస్తారు. ఈ మాట ముమ్మాటికీ నిజమని ఏపీకి కొత్త డిప్యూటీ సీఎంగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన పుష్ప శ్రీవాణి నిరూపించేశారు. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నమ్మినబంటులానే కాకుండా పార్టీకి వీర విధేయురాలిగా ఉన్న పుష్పశ్రీవాణి 2014 ఎన్నికల్లో విజయనగరం జిల్లా కురుపాం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ ఆమె అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

ఈ క్రమంలో గిరిజన కోటాలో పుష్పకు మంత్రి పదవి ఖాయమని వార్తలు వినిపించినా... ఏ ఒక్కరూ ఊహించని విధంగా ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కేసింది. ఈ క్రమంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన పుష్ప శనివారం తొలిసారిగా తన సొంత జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మాట తడబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు తమదైన శైలి కామెంట్లతో విరుచుకు పడుతున్నారు.

అయినా పుష్ప ఏమన్నారంటే... ఒకటే లైన్‌లో తమ ముఖ్యమంత్రి జగన్ వెళుతున్నారని, అవినీతి పాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెబుతున్నారని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. దీంతో వెంటనే ఆమె పక్కనున్న నేతలు అలెర్ట్ చేయడంతో అవినీతి రహిత పాలన అనడానికి బదులుగా అవినీతి పాలన అన్నానని గ్రహించిన పుష్ప... అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ థ్యేయమని సరి చేసుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోగా... అవినీతి పాలన అందిస్తామంటూ పుష్ప చేసిన కామెంట్ సోషల్ మీడియాలో చేరిపోయి వైరల్ అయిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English