కేటీఆర్ క్రేజ్ తగ్గుతోందా?

కేటీఆర్ క్రేజ్ తగ్గుతోందా?

కేసీఆర్ తొలి ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రజా సమస్యలు పరిష్కరించడం.. ట్విటర్ వేదికగా ఎవరైనా సమస్యలు చెప్పినా కూడా దానికి స్పందించడంతో కేటీఆర్ అంటే ప్రజల్లో మంచి భావన, క్రేజ్ కూడా ఏర్పడింది. అదేసమయంలో పార్టీపైనా పట్టు చిక్కించుకోవడంతో కేటీఆర్ అంటే ఎవర్ టచ్ చేయడానికి వీల్లేని నేతగా మారారు. కానీ... తాజా పరిస్థితులు మాత్రం అలా లేవు. కేటీఆర్‌పై పార్టీలో అనేకానేక గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా మునుపటిలా యాక్టివ్‌గా లేరు.

ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాల సమయంలో కూడా కేసీఆర్ స్వయంగా కలగజేసుకుంటే తప్ప పరిష్కారం కాలేదు. కేటీఆర్ దీనిపై చొరవ చూపలేదు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పర్ఫార్మెన్స్ తగ్గడం కూడా కొంత ప్రభావం చూపినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కరీంనగర్ స్థానాన్ని బీజేపీకి కోల్పోవడం.. అలాగే నిజామాబాద్‌తో తన సోదరి విజయం అనుమానాస్పదంగా ఉందని మొదటి నుంచి తెలిసినప్పటికీ ఆమెను కనీసం గెలిపించుకోలేకపోవడం వంటివి కేటీఆర్ సామర్థ్యాలపై పార్టీ నేతల్లో అనుమానాలు పెంచినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటికి టీఆరెస్ ప్రభావం బాగా క్షీణించే అవకాశం ఉందన్న అనుమానాలతో పార్టీ నేతలు జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. పార్టీలో కీలక పవర్ సెంటర్లలో ఎవరికీ పూర్తిగా దగ్గరగా ఉండకుండా, ఎవరినీ పూర్తిగా దూరం చేసుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారట. ఆ క్రమంలోనే కేటీఆర్ వద్దకు గతంతో పోల్చితే నేతల తాకిడి తగ్గినట్లు చెబుతున్నారు.

జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయం.. బీజేపీ తెలంగాణను వచ్చే ఎన్నికల నాటికి టార్గెట్ చేస్తున్న తీరు.. అందుకో్సం ఇక్కడ ఎవరైనా బలమైన నాయకుడిని ఉపయోగించుకోవచ్చన్న అనుమానాల నేపథ్యంలో టీఆరెస్ నేతలు కూడా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారట. కేవలం కేటీఆర్ మనిషి అనే ముద్ర, ఆయన గుడ్ లుక్స్ ఉన్నంత మాత్రాన జీవితాంతం రాజకీయంగా క్లిక్ అయిపోతామనుకోవడం భ్రమే అని అర్థం చేసుకుని అన్ని వైపులా కవర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే... ప్రస్తుతం టీఆరెస్‌లో కేటీఆర్ పట్ల క్రేజ్ తగ్గిందని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English