జగన్ మాటలు కేసీఆర్‌కు వినిపించాయా..?

జగన్ మాటలు కేసీఆర్‌కు వినిపించాయా..?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మధ్య స్నేహబంధం రోజురోజుకూ బలపడుతోంది. తమ తమ రాష్ట్రాల కోసం వీరిద్దరూ కలిసికట్టుగా పని చేసుకుపోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పలు విషయాల్లో ఈ ఇద్దరు సీఎంలు పరస్పరం సహకరించుకున్నారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే వెళ్తామని అంటున్నారు. అంత వరకు బాగానే ఉంది కానీ, ఓ విషయంలో మాత్రం వీరిద్దరి ప్రవర్తనలో పూర్తి వ్యతిరేకత కనిపిస్తోంది. అదే.. ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి పక్క పార్టీ నేతల వలసలను ప్రోత్సహించడం.

 ఈ వ్యవహారంపై జగన్ కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. ‘‘గత శాసనసభలో 23మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ముగ్గురు ఎంపీలను కూడా కొనుగోలు చేశారు. చివరకు ఏం జరిగింది..? పైన దేవుడు, ప్రజలు కలిసి గూబ గూయ్‌మనే రీతిలో ఈ అన్యాయాలను తిప్పికొట్టారు. అన్యాయం చేసిన మాదిరిగానే టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఇచ్చారు. అదీ కూడా సరిగ్గా 23వ తారీఖు నాడే. దేవుడు, ప్రజలు కలిసి ఇచ్చిన జడ్జిమెంట్‌ ఇది. ఇంతకన్నా కరెక్ట్‌ జడ్జిమెంట్‌ ఉండదు. చంద్రబాబు మాదిరిగా ప్రలోభాలు పెట్టి.. మంత్రి పదవులు ఇస్తానని ఆశ పెట్టి ఉంటే.. తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కి ఉండేది కాదు. అయినా.. మా పార్టీలోకి ఎవరైనా రావాలి అంటే తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే తీసుకుంటాం. అలా కాకుండా మేము వాళ్లను తీసుకుంటే.. వెంటనే అనర్హత వేటు వేసినా అభ్యంతరం చెప్పం. ఇప్పుడు ఎంతమంది టీడీపీ సభ్యులు తనతో టచ్‌లో ఉన్నారో చెప్పడం లేదు. అందుకు సంతోషపడాలి. పార్టీ ఫిరాయింపులనే ఈ అన్యాయమైన సంప్రదాయం కొనసాగవద్దు. చట్టసభలో ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్ష సభ్యులు కొనసాగాలి. పరిస్థితులు పూర్తిగా మారిపోయి కొత్త సంప్రదాయం రావాలి’’ అని జగన్ చెప్పుకొచ్చారు.

 అయితే జగన్ స్నేహితుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం భిన్నమైన రాజకీయాలు చేస్తున్నారు. ఆకరేషన్ ఆకర్ష్ ప్రయోగించి తనకు అవసరం లేకున్నా.. ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లోకి తీసుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి చేరడం.. సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని వారంతా కోరడం... దానికి స్పీకర్ వెంటనే ఆమోదం తెలపడం అంతా చకచకా జరిగిపోయింది. ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో ఉంది. గతంలోనూ టీడీపీని ఇలాగే టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఇలా ప్రతిపక్షమే లేకుండా చేయడానికి కేసీఆర్ తహతహలాడుతుంటే.. జగన్ మాత్రం ఇలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలు కేసీఆర్‌కు వినిపించాయో.. లేదో..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English