పవన్ యూటర్న్?.. రీజన్ మాత్రం అదిరింది

పవన్ యూటర్న్?.. రీజన్ మాత్రం అదిరింది

‘‘నా జీవితం రాజకీయాలకే అంకితం. నన్ను నలుగురు మోసుకెళ్లేవరకూ జనసేనను మోస్తా. నాకు ఓటమి కొత్త కాదు. దెబ్బ తగిలే కొద్దీ ఎదిగే వ్యక్తిని నేను. 25 ఏళ్లు లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చా. ఓటమి ఎదురైన ప్రతిసారీ పైకి లేస్తా. ఇప్పుడు కాకపోతే మరోసారి గెలుస్తా.. కానీ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా. వాళ్ల కోసమే పోరాటం సాగిస్తా’’ ఇవీ గత శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి జరిగిన కార్యకర్తల సమావేశంలో మనసు విప్పి మాట్లాడిన ఆయన పై విధంగా స్పందించారు.

 అయితే, ఇప్పుడు ఈ విషయంలో ఆయన యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఆయన త్వరలోనే మరోసారి సినీ రంగంలోకి రాబోతున్నారని సమాచారం. ఈ విషయంపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఎన్నికల ముందే పవన్ గతంలో కమిట్‌మెంట్ ఇచ్చిన నిర్మాతల కోసం సినిమాలు చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు. పైగా ఇటీవల తాను రాజకీయాల్లోనే ఉంటాను అని కరాకండిగా చెప్పుకొచ్చారాయన. ఇలాంటి సమయంలో పవన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించడానికి ముందు పవన్ కల్యాణ్ ముగ్గురు నిర్మాతల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది. ఇప్పుడు వారి కోసం సినిమాలు చేయడానికి పవన్ సిద్ధం అవుతున్నారట. అంతేకాదు, దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం కూడా రెడీ చేసేశారట జనసేన అధినేత. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీని నడిపేందుకు అవసరమైన డబ్బులు తన వద్ద లేవని, అందుకోసం రెండో మూడో సినిమాలు చేసి పార్టీ కోసం పని చేస్తున్న వారికి సాయం చేస్తానని ఆయన చెప్పబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.

 నిజానికి దీని గురించి కొద్దిరోజుల క్రితమే ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘‘మన పార్టీ కోసం పేపర్ పెడతాను అని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఆయనకు డబ్బులెలా వస్తాయి. ఉన్న టీవీ ఛానెల్ మెయింటైన్ చెయ్యలేక అమ్మేసుకుంటున్నావ్. ఇప్పుడు పత్రిక పెట్టడానికి సినిమాల్లో నటిస్తావు.... అంతేగా. ఎంతైనా 3 నిర్మాతల దగ్గర ఆల్రెడీ బయానా తీసుకున్నావుగా!! నువ్వు భలే చిలిపి పవనూ!!!’’ అంటూ ఆయన వ్యంగ్యంగా పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల్లో ఈయన చేసిన పోస్ట్ నిజం కాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English