రోజా తన అసంతృప్తిని ఇలా బయటపెట్టింది

రోజా తన అసంతృప్తిని ఇలా బయటపెట్టింది

నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మొండిచేయి చూపిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఆయన.. రోజాకు చోటు ఇవ్వకపోవడం హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమెకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారని లీకులు వచ్చాయి. అంతేకాదు, కొందరైతే రోజాను హోం మంత్రి చేయబోతున్నారని అన్నారు. మరికొందరైతే ఈ వార్తలను ఖండిస్తూ కాదు.. కాదు.. ఆమెకు స్పీకర్‌ పదవి కట్టబెట్టబోతున్నారని చెప్పుకొచ్చారు.

 కానీ, వైసీపీ అధినేత మాత్రం రోజాకు రిక్త హస్తం చూపించారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే ఆమెకు మంత్రి పదవి కేటాయించలేకపోయామని ఆయన చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. వైసీపీలోని చాలా మంది నాయకులు కూడా ఇదే చెప్పుకొచ్చారు. దీంతో రోజా రెండు మూడు రోజులు ఎవరికీ కనిపించలేదు. ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండిపోయారు. ఈ విషయం తెలిసిన జగన్.. ఆమెను అమరావతికి పిలిపించారు. రోజాతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆ తర్వాత అంటే బుధవారం సాయంత్రం ఆమెకు నామినేటెడ్ పదవి కేటాయించారు.

 రోజాను ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్‌గా నియమించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ విషయం పార్టీ వర్గాలకు చెప్పి అధికారికంగా ప్రకటన చేయించారు. వాస్తవానికి రోజాకు ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కుతుందని అంతా భావించారు. మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వనున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ పదవి ఇచ్చినా రోజా అసంతృప్తి చల్లారలేదని తెలుస్తోంది. గురువారం జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ.

 మంత్రి పదవి తనకు దక్కలేదన్న అసంతృప్తి రోజాలో కనిపించింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మీకు నామినేటెడ్ పదవి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు..? అని ప్రశ్నించగా.. ఆ పదవి తనకు కేటాయించినట్లు తెలియదని చెప్పి షాకిచ్చారు. వాస్తవానికి రోజాకు పదవి కేటాయించిన వెంటనే ఆమె మీడియా సాక్షిగా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు దీనిపై రివర్స్‌లో మాట్లాడి తన అసంతృప్తిని పరోక్షంగా వెల్లగక్కారు. దీనిపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English