వైకాపాకు 6 నెలలు టైం ఇద్దామనుకున్నారట... కానీ

వైకాపాకు 6 నెలలు టైం ఇద్దామనుకున్నారట... కానీ

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన ప్రతిసారీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఒక మాట అంటుంటుంది. ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలే చేస్తామని.. ఈ ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇచ్చి చూస్తామని స్టేట్మెంట్లు ఇస్తుంది. ఐతే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. తమను ఓడించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం వెంటనే దాడి మొదలుపెట్టింది.

నిజానికి వైకాపాకు ఆరు నెలల సమయం ఇద్దామనుకున్నామని.. కానీ అధికారం సొంతమైన వెంటనే తమ కార్యకర్తలపై వైకాపా వాళ్లు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో తాము ఉపేక్షించే సమస్యే లేదని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొనడం గమనార్హం. బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. దీనికి ముందు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. శాసనసభలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా మండలిలో తెదేపాకే బలముందని.. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెదేపా నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తారని.. గట్టిగా ఎదుర్కోవాలని అన్నారు. ముందు వైకాపా ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని అనుకున్నామని.. కానీ తెదేపా కార్యకర్తలను భయపెట్టడం, దాడులకు పాల్పడటం వంటివి చేస్తుంటే మౌనంగా ఉండలేమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీపై, నాయకులపై అవినీతి బురద చల్లితే వెంటనే తిప్పికొట్టాలన్నారు. ప్రభుత్వంపై చేసే విమర్శలు సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని సూచించిన చంద్రబాబు.. ప్రతి శాఖలో జరిగే కార్యక్రమాలను అధ్యయనం చేయాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసే జీవోలను విశ్లేషించాలని, అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

మరోవైపు శాసనసభలో తెదేపా ఉపనేతల పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడుకు పార్టీ ఉపనేతలుగా బాధ్యతలు అప్పగించారు. శాసనసభలో తెదేపా విప్‌గా వీరంజనేయస్వామి వ్యవహరించనున్నారు. శాసనమండలిలో తెదేపాపక్షనేతగా యనమల రామకృష్ణుడు, ఉపనేతలుగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌, సంధ్యారాణి, శ్రీనివాసులు, విప్‌గా బుద్దా వెంకన్న బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English