ధావన్‌కు గాయం.. ట్విస్టు అదే

ధావన్‌కు గాయం.. ట్విస్టు అదే

ప్రపంచకప్‌లో వరుసగా రెండు విజయాలు సాధించి ఊపుమీదున్న భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీ చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్.. గాయపడ్డాడు. అతను దాదాపు మూడు వారాలు ఆటకు దూరంగా ఉండాల్సిన పరిస్థిితి తలెత్తినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని భారత జట్టు ధ్రువీకరించడం లేదు. కనీసం మూడు మ్యాచ్‌లకైతే అతను దూరమవుతున్నాడు.

గురువారం న్యూజిలాండ్‌తో తలపడబోతున్న భారత్.. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొనబోతోంది. ఆ తర్వాత 22వ తేదీన అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతుంది. ముందు ఆడే రెండు మ్యాచ్‌లు.. ముఖ్యంగా పాకిస్థాన్‌తో పోరుకు ధావన్ లేకపోవడం పెద్ద లోటు అనడంలో సందేహం లేదు. ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ టోర్నీల్లో ధావన్‌కు చాలా మంచి రికార్డుంది. ఈసారి ప్రపంచకప్‌కు ముందు పెద్దగా ఫామ్‌లో లేని అతను.. టోర్నీ మొదలవగానే ఫామ్ అందుకున్నాడు. అలాంటి ఆటగాడు ఇలా దూరం కావడం బాధాకరమే.

ఐతే ధావన్ దూరమయ్యాడు కాబట్టి వెంటనే రిషబ్ పంత్‌ను జట్టులోకి ఎంపిక చేస్తారని.. ధావన్ కోలుకున్నాక అవసరమైతే పంత్‌ను పక్కన పెడతారని అందరూ అంచనా వేశారు. కానీ టీమ్ ఇండియా మాత్రం ధావన్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడనే లేదు. బీసీసీఐ కూడా మౌనంగానే ఉంది. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుండొచ్చు. కానీ ఇక్కడో ట్విస్టు ఉంది. ఒకవేళ పంత్‌ను ఎంపిక చేస్తే.. ధావన్ మళ్లీ జట్టులోకి రావడానికి వీల్లేదు. ప్రపంచకప్ మధ్యలో ఒక ఆటగాడు గాయపడితేనే జట్టును మార్చడానికి వీలుంటుంది. అలా కాకుండా ఎలా పడితే అలా ఆటగాళ్లను మార్చుకోవడానికి అవకాశం లేదు. అది ఐసీసీ రూల్. అంటే ధావన్ మళ్లీ కోలుకున్నప్పటికీ జట్టులోకి రావాలంటే ఎవరో ఒకరు గాయపడాలి.

ధావన్ అందుబాటులో లేని మూడో నాలుగో మ్యాచ్‌లకు వేరొకర్ని ఎంచుకోకపోయినా పర్వాలేదు.. 27వ తేదీన వెస్టిండీస్‌ మ్యాచ్ సమయానికైతే అతను కోలుకుంటే చాలని.. తిరిగి అతడిని జట్టులోకి తీసుకోవచ్చన్నది భారత జట్టు ఆలోచన. భారత్ సెమీస్ చేరడానికి మెండుగా అవకాశాలున్నాయి కాబట్టి అన్నింటికీ మించి అతను సెమీస్‌కు చాలా అవసరం అని భావిస్తున్న టీమ్ మేనేజ్మెంట్.. తన స్థానంలో వేరే ఆటగాడు లేకపోయినా పర్వాలేదని అనుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English