నేను హోంమంత్రిన‌వుతా..రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నేను హోంమంత్రిన‌వుతా..రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కలేదని మనస్తాపంతో ఉన్నారన్న వార్తల మధ్య ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రోజా తాజాగా సీఎంతో భేటీ అయ్యారు. ఈ ఉదయం నగరి ఎమ్మెల్యే రోజాకు విజయసాయిరెడ్డి ఫోన్ చేశారు. సాయంత్రం విజయవాడలోని సీఎం ఇంట్లో జగన్ ను కలవాలని సూచించారు. సీఎం ఇంటినుంచి ఫోన్ రావడంతో రోజా హైదరాబాద్ నుంచి విజయవాడలో సీఎంను క‌లిశారు. దాదాపు ప‌ది నిమిషాల పాటు సాగిన భేటీ అనంత‌రం..నేను హోంమంత్రిని అవుతా అని రోజా ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో స‌మావేశం అనంత‌రం వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పదవి దక్కనందుకు తనకు ఎటువంటి అసంతృప్తి లేదన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా పదేళ్లు కష్టపడ్డామని, తమకు పదవుల అవసరం లేదన్నారు. అలగడాలు.. బుజ్జగించడాలు వంటివి వైసీపీలో ఉండవని పేర్కొన్న రోజా...అటువంటి తప్పుడు కథనాలతో తమ మధ్య దూరం పెంచవద్దన్నారు. మంత్రి పదవి రానందుకు తాను అసంతృప్తికి లోనయ్యానంటూ వచ్చిన కథనాలను చూసి తానూ బాధపడ్డానన‌ని రోజా తెలిపారు. జగన్‌ ముఖ్యమంత్రైతే తామంతా ముఖ్యమంత్రి అయినట్టే అని ప్ర‌క‌టించారు. తమ నియోజకవర్గ ప్రజలకు 'నవరత్నాలు' అందేలా చూస్తాన‌ని ప్ర‌క‌టిస్తూ....అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశానన్నారు. దేవుడి అనుగ్రహము ఉంటే త‌ర్వాత‌ హోం మంత్రి అవుతాన‌ని రోజా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

కేబినెట్‌ కూర్పుపై స్పందిస్తూ....కుల సమీకరణాల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని అనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి మంత్రులు ఉంటే సరిపోతుంది కదా..  ఎమ్మెల్యేలు ఎందుకు? అందుకే నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు' అని చెప్పారు. తనకు నామినేటెడ్‌ పదవి ఇస్తానని ఎవరూ చెప్పలేదని.. అది కూడా మీడియా సృష్టేనని ఆమె తెలిపారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల కోసమే విజయవాడ వచ్చానన్న రోజా.. మంత్రి పదవులు లభించిన అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. మంత్రి పదవి దక్కలేదన్న బాధ తనకు లేదన్న రోజా.. తాను అలిగానన్నది మీడియా ప్రచారం మాత్రమేనని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English