జగన్ నిర్ణయాలతో కేసీఆర్‌కు ఇబ్బందులే..!

జగన్ నిర్ణయాలతో కేసీఆర్‌కు ఇబ్బందులే..!

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన కేబినెట్‌ భేటీలో ఆర్టీసీ విలీనం, అంగన్‌వాడీలు, హోంగార్డులకు తెలంగాణ రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం, ఉద్యోగులకు 27శాతం ఐఆర్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అంగన్‌వాడీల వేతనాన్ని రూ.11,500, మెప్మా, సెర్ప్‌లలో రిసోర్స్‌ పర్సన్స్‌, యానిమేటర్ల వేతనాన్ని రూ.10వేలు, డీఎస్సీ ద్వారా గ్రామ, వార్డు వలంటీర్లు, రైతుకు భరోసా, ఉచిత బోర్లు, అమ్మ ఒడి కింద రూ.15వేలు, పారిశుధ్య కార్మికులకు రూ.18వేలు, వడ్డీలేని వ్యవసాయ రుణాలు ఇలా ఎన్నో వరాలను ప్రకటించారు. వాటి అమలు తేదీలను కూడా వెల్లడించారు.

 జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలకు సంబంధించిన అంశాల్లో ముఖ్యమంత్రి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయా వర్గాలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. దీంతో తెలంగాణలోని అవే వర్గాల వారు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఏపీ కేబినెట్‌ నిర్ణయంతో రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల్లో కదలిక మొదలైంది. విలీనంపై సర్కారును కోరాలని వారంతా యోచిస్తున్నారు.

 మరోవైపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం(సీపీఎస్‌) రద్దు అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ ఉద్యోగులు ఇక్కడి ప్రభుత్వం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. తెలంగాణ సర్కారు కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని బలంగా డిమాండ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలాగే, నిరుద్యోగులు కూడా ఉద్యోగ కల్పన కోసం పోరాటానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు విద్యార్థి సంఘాలు ఈ మేరకు ఆలోచన చేస్తున్నాయని తెలుస్తోంది. వీరు మాత్రమే కాదు.. ఏపీలో ఏమి అమలైనా అది తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండబోతుందని ఈ పరిణామాలతో అర్థమవుతోంది.

 ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఎంతో స్నేహబంధం కొనసాగుతోంది. తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎంతోగానో కోరుకున్నారు. అనుకున్నట్లుగానే ఆ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రభుత్వాలు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు.. కరచాలనం అంటూ చెప్పుకొచ్చారు.

 వాస్తవానికి వీరిద్దరి మధ్య బంధం చాలా రోజుల క్రితమే ఏర్పడింది. ముందస్తు ఎన్నికల సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం నచ్చని కేసీఆర్.. ఏపీలో వైసీపీని గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. అక్కడ వైసీపీ, ఇక్కడ టీఆర్ఎస్ పరస్పరం సహకరించుకోవడం రెండు పార్టీల విజయానికి ఒక కారణం అయింది. వీరి మధ్య బంధం ఇలాగే కొనసాగితే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే, ఇది దీర్ఘకాలం కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి కారణం ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరే అని చెప్పుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English