ఏపీ కొత్త గవర్నర్ ఎవరు? విద్యాసాగరరావా? దత్తన్నా?

ఏపీ కొత్త గవర్నర్ ఎవరు? విద్యాసాగరరావా? దత్తన్నా?

రాష్ట్రాల గవర్నర్లను మార్చడానికి కేంద్రం సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల గవర్నర్లు వరుసగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలవడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను తెలంగాణకు పరిమితం చేసి ఏపీకి కొత్త గవర్నరును నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో భాగంగా సుష్మా స్వరాజ్‌ను నియమించారని నిన్న ప్రచారం జరగడం.. తరువాత ఆ సమాచారం తప్పని ఆమె ఖండించడం తెలిసిందే. అలాంటప్పుడు సుష్మ కాకుంటే ఏపీకి కొత్త గవర్నరు ఇంకెవరన్న చర్చ జరుగుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాలకు ఐదేళ్లుగా, అంతకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గవర్నర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను ఒక రాష్ట్రానికి పరిమితం చేయవచ్చునన్న అంచనాల్లో నిజముందని బీజేపీ వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్లకు న్యాయం చేసే క్రమంలో గవర్నరు పదవులు ఇస్తారని భావిస్తున్నారు.

ఏపీ గవర్నరుగిరీని సుష్మ వద్దన్నారని.. ఆమె మహారాష్ట్రకు నియమించమని కోరుతున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే అక్కడ గవర్నరుగా ఉన్న తెలుగు నేత విద్యాసాగర్‌ రావును ఏ రాష్ట్రానికి బదిలీ చేస్తారన్నది తెలియాలి. ఏపీలో అధికారంలో ఉన్న జగన్‌ బీజేపీ, మోదీలతో మంచి సంబంధాలు మెంటైన్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఘర్షణ పూరిత వాతావరణం ఏమీ ఉండదు కాబట్టి మృదు స్వభావి అయిన, స్థానికంగా మంచి పరిచయాలున్న విద్యాసాగరరావును ఏపీకి పంపాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కిరణ్ బేడీ పేరు కూడా పరిశీలనలో ఉందని టాక్.

అలాగే... మోదీ గత ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దొరికినా తరువాత తప్పించిన బండారు దత్తాత్రేయ పేరు కూడా వినిపిస్తోంది. ఆయనకు మొన్నటి ఎన్నికల్లో టికెట్‌ కూడా దక్కలేదు. ఆయన స్థానంలో పోటీ చేసిన కిషన్ రెడ్డి విజయం సాధించి మోదీ  మంత్రివర్గంలో చేరారు. తెలంగాణలో పార్టీకి అవకాశాలు కల్పిస్తున్న వేళ దత్తాత్రేయ వంటి సీనియర్ నేతను అసంతృప్తి పరచడం అక్కడి క్యాడర్‌లో నెగటివ్ సంకేతాలు పంపుతుంది కాబట్టి ఆయన్ను ఏపీ గవర్నరుగా పంపాలన్న యోచన ఒకటి ఉన్నట్టు తెలుస్తోంది.  ప్రధానంగా విద్యాసాగరరావు, దత్తన్న మధ్యే ఏపీ గవర్నరు పదవికి పోటీ ఉందన్నది లేటెస్ట్ టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English