పవన్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన వర్మ

 పవన్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన వర్మ

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫలితాలను ఉద్దేశించి తొలిసారి మాట్లాడారు. శనివారం మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తనను కలవడానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు రావడంతో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు అప్పటికప్పుడు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో పవన్ ''ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దాం.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఎలా ఉంటుందో చూద్దాం.

 ఈ ఐదేళ్ల కాలంలో ఎక్కడ ఆకలి, ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ జనసేన కనపడాలి.. మనం ఉన్నామనే భరోసా ప్రజలకు ఇవ్వాలి. నా జీవితం రాజకీయాలకే అంకితం. నన్ను నలుగురు మోసుకెళ్లేవరకూ జనసేనను మోస్తా. నాకు ఓటమి కొత్త కాదు. దెబ్బ తగిలే కొద్దీ ఎదిగే వ్యక్తిని నేను. 25 ఏళ్లు లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చా. ఓటమి ఎదురైన ప్రతిసారీ పైకి లేస్తా. నన్ను ఓడించేందుకు భీమవరంలో రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. పవన్‌ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వరాదన్నది వారి లక్ష్యం. ఇప్పుడు కాకపోతే మరోసారి గెలుస్తా.. కానీ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా. వాళ్ల కోసమే పోరాటం సాగిస్తా'' అన్నారు.

 పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఆయన స్పందించారు. ''భీమవరంలో నన్ను ఓడించడానికి రూ. 150 కోట్లు ఖర్చు చేశారన్న పవన్ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించే విధంగా ఉన్నాయి. అసలు పవన్ కల్యాణ్‌ను నిజంగా గెలిపించాలనుకుంటే, ఎంత మంది ప్రభావితం చేసినా అక్కడి ఓటర్లు ఆయనకే ఓటు వేసేవారు. కానీ, ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అర్థరహితం'' అంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు.

 ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది. సీపీఎం, సీపీఐ, బీఎస్పీలతో కలిసి కూటమిగా ఏర్పడిన ఆ పార్టీ ఈ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. అయితే, ఊహంచని రీతిలో జనసేన ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాకలో బరిలో దిగారు. ఈ రెండింటిలో ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయారు. ఇక, జనసేన తరపున రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక వర ప్రసాద్ ఒక్కరే గెలిచి పరువు నిలబెట్టారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English