బీజేపీలోకి దేవేంద‌ర్‌గౌడ్...బాబుకు ఇంకో దెబ్బ‌

బీజేపీలోకి దేవేంద‌ర్‌గౌడ్...బాబుకు ఇంకో దెబ్బ‌

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి దెబ్బ‌మీద‌దెబ్బ త‌గులుతోంది. ఇప్ప‌టికే ఉనికి కోల్పోయి...పార్టీ చ‌రిత్ర‌ల్లో ఎన్న‌డూ లేని విధంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేని స్థితికి చేరిపోయిన సైకిల్ పార్టీకి మ‌రింత షాక్ ఇచ్చేలా ప‌రిణామాలు మారుతున్నాయి. ఇప్ప‌టికే ముఖ్య‌నేత‌లు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌లో చేరిపోగా....మిగిలిన కొంద‌రు నేత‌ల‌కు గాలం వేసేందుకు...కొత్త ప్ర‌త్య‌ర్థి బీజేపీ ఎర వేస్తోంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ ముఖ్య‌నేత‌లు పార్టీ మార‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీలో నెంబ‌ర్‌2గా ఓ వెలుగు వెలిగిన దేవేంద‌ర్ గౌడ్ బీజేపీలో చేర‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్యంగా 4 పార్ల‌మెంటు స్థానాల్లో గెలుపొందింది. దీంతో పాటుగా రెండు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యానికి దరిదాపుల్లోకి వ‌చ్చింది. ఇలా అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీస్తోందని ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ అగ్ర నేతల సూచనలతో రాష్ట్ర లీడర్లు రంగంలోకి దిగారని, ఇతర పార్టీల్లోని సీనియ‌ర్లు,  అసమ్మతి నాయకులను సంప్రదిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. తెలంగాణ‌లో తెర‌మ‌రుగు అయిపోయిన తెలుగుదేశంలోని కొంద‌రు నేత‌లు వీరి ఫోక‌స్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీకి షాకిస్తూ, ఇటీవలే టీడీపీ నేత పెద్దిరెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. టీడీపీలో ఒకప్పుడు నంబర్‌ టూగా ఉన్న దేవేందర్‌గౌడ్‌ను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనతోపాటు ముగ్గురు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. త్వ‌ర‌లో ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఈ విష‌య‌మై ఇటు దేవేంద‌ర్‌గౌడ్ కానీ అటు బీజేపీ కానీ అధికారికంగా స్పందించ‌లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English