నా ఓట‌మికి 150 కోట్ల ఖ‌ర్చు...ప‌వ‌న్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నా ఓట‌మికి 150 కోట్ల ఖ‌ర్చు...ప‌వ‌న్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న ఓట‌మిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జరిగిన ఎన్నిక‌ల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన జ‌న‌సేనాని..రెండు చోట్లా ఓట‌మి పాల‌యిన సంగ‌తి తెలిసిందే. భీమ‌వ‌రం, గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌న్ ఓడిపోవ‌డం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశ‌లో ప‌డేయ‌గా..రాజ‌కీయ విశ్లేష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అయితే, ఈ ఓట‌మిపై ప‌వ‌న్ తాజాగా కొత్త విశ్లేష‌ణ చేశారు.  మంగ‌ళ‌గిరిలో కార్య‌క‌ర్త‌ల‌తో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాజాగా స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఒక్క ఓట‌మి జ‌న‌సేన పార్టీని ఆప‌లేద‌ని అన్నారు. తాను ఓట‌మిని అంగీక‌రించేవాడిని కాదని, విజ‌యం సాధించే వ‌ర‌కు పోరాడుతాన‌ని ప్ర‌క‌టించారు.  భీమ‌వ‌రంలో ఓడించేందుకు రూ.150 కోట్లు ఖ‌ర్చు చేశారని ప‌వ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

మంగ‌ళ‌గిరిలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జిల్లాల వారీ స‌మీక్షా స‌మావేశాల్లో పాల్గొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సంద‌ర్బంగా ప్రసంగిస్తూ “నా జీవితం రాజ‌కీయాల‌కు అంకితం. నేను మ‌ళ్లీ చెబుతున్నా నా శ‌వాన్ని న‌లుగురు మోసుకువెళ్లే వ‌ర‌కు నేను జ‌న‌సేన‌ను మోస్తా. నాకు ఓట‌మి కొత్త కాదు. దెబ్బ తినే కొద్ది ఎదిగే వ్య‌క్తిని. 25 సంవ‌త్స‌రాల ల‌క్ష్యంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. ఓట‌మి ఎదురైతే త‌ట్టుకోగ‌ల‌నా లేదా అని న‌న్ను నేను ప‌రీక్షించుకున్న త‌ర్వాతే పార్టీ స్థాపించా. ఓట‌మి ఎదురైన ప్ర‌తిసారీ పైకి లేస్తా.. బ‌లంగా గెలుస్తా. తాజా ఓట‌మికి ఈవీఎం ట్యాంప‌రింగ్‌, డ‌బ్బు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు చెబుతున్నారు. భీమ‌వ‌రంలో న‌న్ను ఓడించ‌డానికి రూ.150 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని తెలిసింది.  ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని అసెంబ్లీలో అడుగుపెట్ట‌నివ్వ‌రాదు.. ఎలాగ‌యినా ఓడించాలి అనేది వారి ల‌క్ష్యం. వీట‌న్నింటినీ నేను ప‌ట్టించుకోను. ప్ర‌జా తీర్పును గౌర‌విద్దాం. వైసీపీ పాల‌న ఎలా ఉంటుందో చూద్దాం`` అని వ్యాఖ్యానించారు.

కుయుక్తుల‌తో కూడిన రాజ‌కీయాలు తాను చేయ‌నని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``స‌మీక్ష‌కి వ‌చ్చిన ప్ర‌తి అభ్య‌ర్ధిని అడుగుతున్నా మీరు ఉంటారా, వెళ్లిపోతారా అని. మేము మీ వెంటే ఉన్నాం అని చెప్ప‌డానికే ఇక్క‌డికి వ‌చ్చాం అంటున్నారు. ఇంత‌కు మించిన విజ‌యం ఏం కావాలి? ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనే వ్య‌క్తిత్వం బ‌య‌టప‌డుతుంది. ఓట‌మి ఎదురైన‌ప్పుడే నువ్వు నావాడివా ప‌రాయివాడివా అన్న విష‌యం అర్ధం అవుతుంది. మీరంతా నా కోసం వ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు. ఓట్లు వేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. నేను మ‌ళ్లీ చెబుతున్నా ఏదో ఒక ఎన్నిక‌ల కోసం వ‌చ్చి వెళ్లిపోవ‌డానికి పార్టీ పెట్టలేదు. క‌ష్ట‌మైన ప్ర‌యాణం అని తెలిసీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చా. ఓట‌మికి కుంగిపోను దెబ్బ‌తినే కొద్ది ముందుకు వెళ్తూనే ఉంటా. ఈ ఆఫీస్ మనది. ఎవ‌రైనా ఎపుడైనా రావ‌చ్చు. అంద‌రికీ అందుబాటులో ఉంటా. అంద‌ర్నీ క‌లిసేందుకు ప్ర‌త్యేక స‌మ‌యం కేటాయిస్తాను” అని తెలిపారు.

కాగా, రెండ్రోజుల క్రితం తాను ఎయిర్‌పోర్టు నుంచి వ‌స్తుంటే రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఓ గ్రామ‌స్తులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ప్ల‌కార్డుల‌తో రోడ్ల మీద‌కి వ‌చ్చారని ప‌వ‌న్ తెలిపారు. `ప్ర‌స్తుతం మ‌న ముందు ఉన్న ల‌క్ష్యం ఒక్క‌టే. ఎక్క‌డ ఆక‌లి ఉంటుందో, ఎక్క‌డ స‌మ‌స్య ఉంటుందో అక్క‌డ జ‌న‌సేన గుర్తు క‌న‌ప‌డాలి. అక్కడి ప్రజలకు మనం ఉన్నాం అనే భరోసా ఇవ్వాలి.` అని పార్టీ శ్రేణుల‌కు ప‌వ‌న్ ఆదేశాలు జారీ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English