జగన్‌తో పాటు జైలుకొచ్చిన వ్యక్తికి మంత్రి పదవి

జగన్‌తో పాటు జైలుకొచ్చిన వ్యక్తికి మంత్రి పదవి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైవిధ్యంగా అడుగులు వేస్తున్నారు. పాలనతో పాటు పార్టీ విషయంలోనూ ఆయన వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇదే పంథాను మంత్రివర్గ ఏర్పాటులోనూ కొనసాగించారు. మంత్రివర్గ ఏర్పాటుపై ఎంతో కసరత్తు చేసిన ఏపీ సీఎం.. సీనియర్లు, జూనియర్ల కలయికతో ఇది రూపొందించారు. ముఖ్యంగా జగన్‌ తన జట్టులో చేర్చుకున్న వారిలో ఆరుగురు తన తండ్రి వైఎస్‌ హయాంలోనూ మంత్రులుగా చేసిన వారు ఉన్నారు. మొత్తానికి సీనియర్ల కంటే ఎక్కువగా తనను నమ్ముకున్న వారికే అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగానే అప్పట్లో తనతో పాటు జైలు శిక్ష అనుభవించిన నేతకు మంత్రి పదవి కేటాయించారు.

 ఆయనే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ. మత్స్యకార కుటుంబంలో జన్మించిన ఆయన డిగ్రీ చదివారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించిన ఆయన వైఎస్‌ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మోపిదేవి ఈ ఎన్నికల్లో రేపల్లె స్థానం నుంచి పోటీపడి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు జగన్‌ మంత్రిగా అవకాశమిచ్చారు. దీనికి కారణం తనతో పాటు కష్టాలను పంచుకున్న మోపిదేవి వెంకటరమణకు జగన్‌ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యమే. ఆయనకు పశు సంవర్థకం, మత్స్య, మార్కెటింగ్‌ శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈయన వైఎస్ హయాంలోనే కాదు.. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లోనూ కొనసాగారు. తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

 వైఎస్ జగన్ వెంట నడిచిన మోపిదేవి వెంకటరమణ.. ఆయనతో పాటు జైలుకు వెళ్లారు. వాన్‌పిక్ కేసులో సీబీఐ ఆయనను నిందితుడిగా చేర్చింది. దీంతో ఈ కేసులో ఆయనే అందరి కంటే ముందు అరెస్ట్ అయ్యారు. దీంతో మోపిదేవి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో ఆయన 16 నెలలు జైలులో ఉన్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో పోటీ చేయడానికి క్లియరెన్స్ తెచ్చుకుని పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌ చేతిలో 13,355 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్‌లకు మంత్రి పదవులు ఇస్తానని వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం సమయంలోనే ప్రకటించారు. కానీ... ఊహించని విధంగా మోపిదేవిని కేబినెట్‌లోకి తీసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English