ఓడితే గానీ... పీకేకు త‌త్వం బోధ‌ప‌డ‌లేదా?

ఓడితే గానీ... పీకేకు త‌త్వం బోధ‌ప‌డ‌లేదా?

అప్ప‌టిదాకా సినిమాలు చేసుకుంటూ... త‌న‌దైన ల‌గ్జ‌రీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ సాగిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు నిజంగానే... ప్ర‌శాంత‌మైన సినిమాల‌ను వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చానా? అని బాధ‌ప‌డుతున్నార‌ని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో 2014 ఎన్నిక‌ల‌కు ముందే జ‌న‌సేన పేరిట పార్టీ పెట్టిన ప‌వ‌న్‌... ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా టీడీపీ, బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చారు. తీరా 2019 ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి క‌నీసం ఏపీలో అయినా పోటీ చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు వ‌చ్చాయి. ఈ క్రమంలో ఎలాగూ రంగంలోకి దిగేశాం క‌దా అంటూ ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో సాగారు. అయితే రాజ‌కీయాల‌న్నాక అంత ఈజీ ఏమీ కాదు కదా. కాక‌లు తీరిన పొలిటీషియ‌న్లే మ‌ట్టిలో క‌లిసిపోతే... రాజ‌కీయాల్లో క‌నీసం ఓన‌మాలు కూడా తెలియ‌ని ప‌వ‌న్ ఓ లెక్కా? ఇప్పుడు ఇదే జ‌రిగింది.

ఎన్నిక‌ల బ‌రిలో దిగేసిన ప‌వ‌న్ మ‌ట్టి కొట్టుకుపోయారు. తాను రెండు చోట్ల పోటీ చేస్తే... త‌న పార్టీ అభ్య‌ర్థుల‌తో ఏకంగా 130కి పైగా స్థానాల్లో పోటీ చేయించారు. అయితే ప‌వ‌న్ రెండు చోట్లా ఓడిపోగా, 130 మందికి పైగా అభ్య‌ర్థుల్లో ఒక్క‌రంటే ఒక్క‌రు మాత్ర‌మే గెలిచారు. వెర‌సి ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత జ‌నానికి ముఖం చూపేందుకు ప‌వ‌న్ సాహ‌సించ‌లేని ప‌రిస్థితి. అయితే ఎలాగూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశారు క‌దా... ఎన్ని రోజుల‌ని జ‌నానికి ముఖం చాటేస్తారు? అందుకేనేమో... మొన్న విజ‌య‌వాడ వ‌చ్చిన ప‌వ‌న్ కాస్తంత హ‌డావిడి చేశారు. ఈ హ‌డావిడిలోనే త‌న‌కు అస‌లు త‌త్వం బోధ‌ప‌డిన‌ట్లుగా ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంచ‌క‌పోవ‌డం త‌మ ఘోర ప‌రాజ‌యానికి ఓ కార‌ణం అయితే... క‌నీసం ఐదేళ్ల క్రిత‌మే ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఉంటే... ఈ ఎన్నిక‌ల్లో కాస్తంత ప‌రిణ‌తితో ముందుకు సాగేవాళ్ల‌మ‌న్న భావ‌న‌ను ప‌వ‌న్ వ్య‌క్తం చేశారు. అస‌లు ఇప్పుడు జ‌రిగిన ఎన్నికలు పార‌ద‌ర్శ‌కంగానే జ‌ర‌గ‌లేద‌న్న‌ది ప‌వ‌న్ వాద‌న‌. అయినా దేశంలో ఎన్నిక‌లు ఎప్పుడు పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగాయ‌ని? ఎప్పుడూ ధ‌న ప్ర‌వాహంతోనే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి క‌దా. మ‌రి ఇప్పుడు కొత్త‌గా పార‌ద‌ర్శ‌క‌త లోపించ‌డ‌మేమిటి? అంటే త‌న‌కు రాజ‌కీయాల్లో ప్ర‌త్యేకించి ఎన్నిక‌ల్లో అనుభవం లేద‌ని ప‌వ‌న్ ఒప్పేసుకున్నార‌న్న మాట. అంటే ఘోర ప‌రాజ‌యం ఎదురైతే గానీ... ప‌వ‌న్ కు త‌త్వం బోధ‌ప‌డ‌లేద‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English