చంద్రబాబు, జగన్ మంత్రివర్గాల పోలికలు, తేడాలు

 చంద్రబాబు, జగన్ మంత్రివర్గాల పోలికలు, తేడాలు

జగన్ మంత్రుల్లో చాలామంది గత చంద్రబాబు కేబినెట్లో ఉన్నవారికి వైసీపీ ప్రభుత్వం పరంగా కచ్చితమైన రీపేస్లేమెంట్‌లా ఎంచుకున్నారని తెలుస్తోంది. సామాజికవర్గాలు, అనుభవం వంటివన్నీ ఇంచుమించుగా ఒకే తరహా మిక్స్‌లో కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో రెండు సామాజికవర్గాలకు ప్రాధాన్యం దక్కగా జగన్ కేబినెట్లో ఆ మేరకు ఆ రెండు సామాజిక వర్గాల నుంచి కొంత తగ్గించి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం దొరికేలా చేశారు.

శ్రీకాకుళం
చంద్రబాబు కేబినెట్లో శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావు మంత్రులుగా పనిచేశారు. తొలుత అచ్చెన్నాయుడు ఒక్కరే ఉండేవారు. ఆయన కొప్పుల వెలమ సామాజికవర్గ నేత. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి జగన్ ధర్మాన కృష్ణదాస్‌కి చాన్సిచ్చారు. ఆయన కూడా కొప్పుల వెలమ నేతే.

విజయనగరం
ఇక విజయనగరం జిల్లాలో చూసుకుంటే చంద్రబాబు తొలి కేబినెట్లో కిమిడి మృణాళినికి చాన్సిచ్చారు. ఆ తరువాత వైసీపీ నుంచి చేరిన బొబ్బిలి ఎమ్మెల్యే రాజా సుజయ కృష్ణ రంగారావుకు చాన్సిచ్చారు. మృణాళిని కాపు సామాజికవర్గ నేత. రంగారావు వెలమ వర్గానికి చెందినవారు. జగన్ కూడా తొలి విడతలో విజయనగరం నుంచి కాపు సామాజికవర్గం నుంచి
బొత్సకు అవకాశం ఇచ్చారు. ఇదే జిల్లా నుంచి అవకాశం దక్కించుకున్న పాముల పుష్ప శ్రీవాణి గిరిజన నేత. విజయనగరంలో గిరిజన జనాభా అధికంగా ఉండడంతో వారికి ప్రాధాన్యమిచ్చారు.

విశాఖ
చంద్రబాబు ఈ జిల్లాలో కాపు నేత గంటా శ్రీనివాసరావుకు, మరో నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవులిచ్చారు. చివర్లో గిరిజన నేత కిడారి మరణంతో ఆయన కుమారుడిని ఎన్నికల ముందు మంత్రిని చేశారు.
జగన్ ఈ జిల్లాలో ఒక్కరికే అవకాశమిచ్చారు. అది కాపు సామజికవర్గానికి చెందిన అవంతి శ్రీనివాస్‌కు దక్కింది.

తూర్పుగోదావరి
జగన్ ఈ జిల్లా నుంచి కీలక సామాజికవర్గం శెట్టిబలిజ(గౌడ)కు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎస్సీ వర్గానికి చెందిన విశ్వరూప్, కాపు నేత కురసాల కన్నబాబులకు అవకాశమిచ్చారు. చంద్రబాబు కేబినెట్లో  ఈ జిల్లా నుంచి కాపు నేత చినరాజప్ప పనిచేశారు. ఆయన ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. యాదవ నేత యనమల రామకృష్ణుడికీ చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు జగన్ కాపులకు అదనంగా ఎస్సీలు, కీలకమైన శెట్టి బలిజ నేతకూ అవకాశమిచ్చారు.

పశ్చిమగోదావరి
ఈ జిల్లా నుంచి కూడా జగన్ ముగ్గురికి చాన్సిచ్చారు. ఎస్సీ మహిళా నేత తానేటి వనిత, రాజుల నుంచి చెరకువాడ రంగనాథరాజు, కాపు నేత ఆళ్ల నానిలకు అవకాశమిచ్చారు. చంద్రబాబు కేబినెట్లో ఈ జిల్లా నుంచి తొలుత ఎస్సీ నేత పీతల సుజాతకు అవకాశమిచ్చిన అవినీతి ఆరోపణలపై అనంతరం తొలగించారు. కాపు నేత పితాని సత్యనారాయణ.. సుజాతను తొలగించాక ఎస్సీ వర్గానికి చెందిన కేఎస్ జవహర్‌కు చంద్రబాబు చాన్సిచ్చారు. ఇప్పుడు జగన్ ఎస్సీ, కాపుతో పాటు రాజులకు కూడా అవకాశమిచ్చారు.

కృష్ణా జిల్లా
జగన్ తన కేబినెట్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని, వైశ్య నేత వెల్లంపల్లి శ్రీనివాస్, కాపు నేత పేర్ని నానిలకు అవకాశం కల్పించారు. చంద్రబాబు కేబినెట్లో ఈ జిల్లా నుంచి కమ్మ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు, మత్స్యకార నేత కొల్లు రవీంద్రలను తీసుకున్నారు. జగన్ ఈ జిల్లా నుంచి వైశ్య, కాపు నేతలకూ చాన్సిచ్చారు. అలాగే మచిలీపట్నం ప్రాధాన్యత దృష్ట్యా చంద్రబాబు మాదిరిగానే అక్కడ గెలిచిన నేతకు అవకాశమిచ్చారు. విజయవాడ నగరంలో గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ని మంత్రిని చేశారు.

గుంటూరు జిల్లా:
ఈ జిల్లా నుంచి జగన్ మేకతోటి సుచరిత(ఎస్సీ), మోపిదేవి వెంకటరమణ(మత్స్యకార)లకు అవకాశం ఇచ్చారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ అవకాశం ఇచ్చారు. గత చంద్రబాబు కేబినెట్లో మత్స్యకార సామాజికవర్గం నుంచి కొల్లు రవీంద్ర మంత్రిగా ఉండగా.. ఈసారి ఓటమి పాలైనా మోపిదేవికి చాన్సు దక్కింది. చంద్రబాబు మంత్రివర్గంలో ఈ జిల్లా నుంచి ఎస్సీ నేత ఆనందబాబు, కమ్మ నేత ప్రత్తిపాటి పుల్లారావులు పనిచేశారు.

ప్రకాశం జిల్లా
చంద్రబాబు కేబినెట్లో వైశ్య నేత శిద్ధా రాఘవరావు ఉండేవారు. జగన్ ఎస్సీ నేత ఆదిమూలపు సురేశ్, రెడ్డి సామాజికవర్గ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి అవకాశం కల్పించారు.

నెల్లూరు జిల్లాలో..
చంద్రబాబు ఈ జిల్లాలో కాపు నేత పి.నారాయణ, రెడ్డి నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి చాన్సివ్వగా.. జగన్... రెడ్డి నేత మేకపాటి గౌతమ్ రెడ్డి, యాదవ నేత అనిల్ కుమార్‌లకు చాన్సిచ్చారు.

చిత్తూరు జిల్లాలో..
చంద్రబాబు ఇదే జిల్లాకు చెందినవారు కావడంతో ఇంకెవరికీ తొలుత అక్కడ అవకాశం రాలేదు. తరువాత దశలో రెడ్డినేత అమర్నాథరెడ్డికి చాన్సిచ్చారు. జగన్ ఈ జిల్లా నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఎస్సీ నేత నారాయణ స్వామిలను మంత్రులను చేశారు.

కడప జిల్లా
జగన్ ముస్లిం మైనారిటీ అయిన అంజాద్ బాషాను తన జిల్లా నుంచి మంత్రిని చేశారు. చంద్రబాబు కేబినెట్లో ఈ జిల్లా నుంచి ఫిరాయింపు నేత ఆదినారాయణ రెడ్డి ఉండేవారు.

కర్నూలు జిల్లా
జగన్ ఈ జిల్లాలో రెడ్డి నేత బుగ్గనకు, బోయ నేత జయరాంకు అవకాశమివ్వగా చంద్రబాబు తన కేబినెట్లో రెడ్డి నేత అఖిలప్రియను తీసుకున్నారు. ఈ జిల్లాకు చెందిన ఈడిగ(గౌడ) నేత కేఈ కృష్ణమూర్తిని ఉప ముఖ్యమంత్రిని చేశారు. అలాగే చివర్లో విస్తరణలో ఎన్.ఎం.డీ.ఫరూక్‌ను మంత్రిని చేశారు.

అనంతపురం
చంద్రబాబు ఈ జిల్లాలో కమ్మ నేత పరిటాల సునీత, బోయ నేత కాల్వ శ్రీనివాసులను మంత్రులను చేశారు.
జగన్ తన కేబినెట్లో కురుమ(యాదవ) నేత శంకరనారాయణకు అవకాశమిచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English