ఇక రేవంతే రావాలి...టీ కాంగ్రెస్ ఆశ

ఇక రేవంతే రావాలి...టీ కాంగ్రెస్ ఆశ

తెలంగాణ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ‌ల మీద ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజయం, అనంత‌రం స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ఓట‌మి, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటుకోలేక‌పోవ‌డం...ఇలా వ‌రుస షాకుల్లో ఆ పార్టీకి కాస్త ఊర‌ట ఇచ్చింది పార్ల‌మెంటు ఎన్నిక‌ల ఫ‌లితాలు. ముగ్గురు ఎంపీల‌ను గెలుచుకొని కాంగ్రెస్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానంలో నిలిచింది. అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడ‌మే కాకుండా త‌మ‌ను టీఆర్ఎస్‌లో విలీనం చేయాల‌నే విన‌తి ఇవ్వ‌డం...అది ఆమోదం సైతం పొందిన నేప‌థ్యంలో...కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో పార్టీని ఆదుకునే నేత‌గా నాయ‌కుల చూపు రేవంత్ రెడ్డిపై ప‌డింద‌ని అంటున్నారు.

12 మంది ఎమ్మెల్యేలు మూక్ముడిగా కారెక్కడం పార్టీ పరువును గంగ‌పాలు చేసింది. అధికార టీఆర్ఎస్‌ పట్ల దూకుడుగా వ్యవహరించకుండా... నిలకడగా, నిమ్మలంగా ఉండటం వల్లే కాంగ్రెస్‌ పార్టీకి ఈ దుస్ధితి వచ్చిందని పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలోని కీలకమైన నేతలు అధికార పార్టీ అడుగులకు ముడుగులు ఒత్తుతున్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతల పట్ల భరోసా లేకపోవడం వల్లే ఎమ్మెల్యేలు చేయిజారిపోతున్నారని చెబుతున్నారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరించాలని పార్టీ నేతలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీపునాది బలంగా ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంలోనే పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని పార్టీ నేతలు అంటున్నారు. టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం చేయడం పట్ల న్యాయపరంగా పోరాడుతూనే... మరోవైపు అధికార పార్టీని ఎప్పటికప్పుడు నిలదీయాలనే భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే పీసీసీ చీఫ్‌ను ఆ ప‌ద‌విలో నుంచి త‌ప్పించ‌డం అనే ప్ర‌తిపాద‌న తెర‌మీద‌కు వ‌స్తోంది. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ పదవి నుంచి తప్పించేందుకు అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ కర్తవ్యాన్ని ఎవరు భుజాన వేసుకుంటారనే ప్రశ్న పార్టీ నేతలను కలవరపరుస్తున్నది. ఈ నేప‌థ్యంలో మల్కాజిగిరి ఎంపీ,పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి పార్టీపై అధిష్టానం దృష్టి ప‌డిన‌ట్లు స‌మాచారం. ఆయన ఇమేజ్‌ని పార్టీ అధిష్టానం ఉపయోగించుకోనుందని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి, ప్రజల్లోకి పోవాలనే నిర్ణయంలో రేవంత్‌ కీలకం కానున్నట్టు తెలిసింది. ఈమేరకు అధిష్టానం కూడా రేవంత్‌రెడ్డి వైపు దృష్టిసారించినట్టు తెలిసింది. త్వ‌ర‌లో రేవంత్‌కు కీల‌క బాధ్య‌త‌లు ద‌క్కినా...ఆశ్చ‌ర్యపోన‌క్క‌ర్లేద‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English