ఈ ముగ్గురు `నాని`లను జ‌గ‌న్ ఎందుకు మంత్రులు చేశారంటే...

ఈ ముగ్గురు `నాని`లను జ‌గ‌న్ ఎందుకు మంత్రులు చేశారంటే...

అనూహ్య మెజార్టీతో ఏపీ ముఖ్య‌మంత్రి పీఠాన్ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అధిరోహించ‌డం...త‌న మార్కు పాల‌న కోసం ఆయ‌న ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌టం..తెలిసిన సంగ‌తే. ఇందులో భాగంగా తాజాగా త‌న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఐదుగురు ఉప‌ముఖ్య‌మంత్రులు ఉంటార‌ని ప్ర‌క‌టించి జ‌గ‌న్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. దీంతోపాటుగా ఆయ‌న కేబినెట్లో మ‌రిన్ని ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నాయి.  జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రివర్గంలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించారు. ఏడుగురు బీసీలకు, ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపు, నలుగురు రెడ్డి, ఒక ఎస్టీ, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించారు.

ఇక ఆస‌క్తిక‌రంగా ముగ్గురు `నాని`ల‌కు జ‌గ‌న్ త‌న మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించారు.  కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నానికి జ‌గ‌న్ త‌న కేబినెట్లో చాన్స్ ఇచ్చారు. జ‌గ‌న్ కేబినెట్లో చోటు సంపాదించుకున్న ఈ ముగ్గురు నానిల‌పై అంద‌రి దృష్టి ప‌డింది. వారిలో ఫైర్‌బ్రాండ్ నేత‌గా పేరున్న కొడాలి నాని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. కొడాలి వెంకటేశ్వరరావు ఆయ‌న పూర్తిపేరు.  గత ఎన్నికల్లోనే హ్యాట్రిక్‌ రికార్డు నమోదు చేసిన ఆయన నాలుగోసారి విజయం సాధించి తనకు తిరుగులేదు అని అనిపించుకున్నారు. జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004, 2009లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన నాని తర్వాత వైసీపీలో చేరారు. 2014లో ఆ పార్టీ తరపున గెలుపొందారు. తాజా ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేశారు.జ‌గ‌న్ కేబినెట్లో తొలిసారిగా మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌న‌న్నారు.

పేర్ని వెంకట రామయ్య ( నాని) కూడా కృష్ణా జిల్లాకు చెందిన నేతే. మచిలీపట్నం నియోజవర్గం నుంచి బ‌రిలో దిగిన పేర్ని నాని సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై 5,590 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో 15 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన పేర్ని నాని..తాజా ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించారు. సామాజికంగానూ  ఆర్థికంగానూ ఇద్దరు ప్రత్యర్థూలు బ‌లంగా ఉండ‌డం, ఇద్దరూ వివాదాల‌కు దూరంగా ఉండ‌డంతో పోటీ కూడా అదే స్థాయిలో జ‌రిగింది.  జ‌గ‌న్ ప్రకటించిన న‌వ‌ర‌త్నాలు త‌న‌కు అనుకూలంగా మార‌తాయని ఆయన ప్రగాఢ నమ్మకంతో ఉండగా అవే ఆయ‌న్ను గెలిపించాయి. దీంతో జ‌గ‌న్ త‌న మంత్రివ‌ర్గంలో చోటు ఇచ్చారు.

ఇక ఆళ్లనాని మూడో సారి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శాసనసభ స్థానం నుంచి విజయం సాధించారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్ల నాని విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఆళ్ల నాని కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన సమీప ప్రత్యర్ధి, మరడాని రంగారావుపై 33,053 ఓట్ల మెజార్టీని సాధించారు. 2009 ఎన్నికల్లో ఆళ్ల సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం అభ్యర్థి బడేటి బుజ్జిపై 13,682 ఓట్ల మెజార్టీని సాధించారు. 2014లో నిర్వహించిన ఎన్నికల్లో ఆళ్ల నాని వైసీపీ తరఫున పోటీ చేశారు. మరోసారి బడేటి బుజ్జిపై పోటీ చేయగా..నాని ఓటమి పాలయ్యారు. బడేటి బుజ్జికి ఆ ఎన్నికల్లో 24780 ఓట్ల మెజార్టీ లభించింది. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో ఆళ్ల నాని వైసీపీ తరఫున పోటీచేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిపై ఆళ్ల నానికి  4072 ఓట్లు మెజార్టీ దక్కింది. దీంతో ఈ విజేత‌కు జ‌గ‌న్ మంత్రి చాన్స్ ఇచ్చారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English