ఏపీలో టీడీపీ నేతల పరిస్థితి చూసినా అర్థమవ్వట్లేదా..?

ఏపీలో టీడీపీ నేతల పరిస్థితి చూసినా అర్థమవ్వట్లేదా..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడిపోయింది. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీ నుంచి శాసన మండలికి ప్రాతినిథ్యం వహిస్తున్న వారందరూ టీఆర్ఎస్‌లో చేరిపోయి, సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసేశారు. ఇప్పుడు ఇదే సీన్ శాసనసభలో కనిపించింది. ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి విజయం సాధించిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్షంలోని 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోనుంది. ఈ ఘట్టం ముగిసిన తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా తామేదో గొప్ప ఘన కార్యం చేసినట్లు ఫీలైపోతున్నారు. అంతేకాదు, గర్వంగా స్టేట్‌మెంట్లు కూడా ఇస్తున్నారు.

 ‘‘పార్టీ మారాలనుకున్న మా నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాం. నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంతో పాటు బంగారు తెలంగాణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాం. టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరగా, ఆయన అంగీకరించారు. విలీనం చేసుకొని మమ్మల్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా గుర్తించాలని కూడా సీఎంను కోరితే ఆయన అంగీకరించారు. మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే 12 మంది ఎమ్మెల్యేలతో సీఎంను కలిసి ఆయన నాయకత్వంలో పని చేస్తామని అడిగాం’’ అని వాళ్లు చెప్పుకొస్తున్నారు.

 వాస్తవానికి ఫిరాయింపులను ఓటర్లు ప్రోత్సహించరు. దానికి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు తరువాత టీడీపీలోకి వెళ్లిపోయారు. వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలు తిరిగి బరిలోకి దిగారు. అయితే ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్‌ ఒక్కరు మాత్రమే విజయం సాధించగా, మిగిలిన వారంతా ఓడిపోయారు. అలాగే ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా విజయం సాధించారు.

 అనకాపల్లి టీడీపీ ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాసరావు భీమిలి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. గుంటూరు పశ్చిమం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి విజయం సాధించిన మోదుగుల వేణుగోపాలరెడ్డి ఓడిపోయారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ సైతం వైసీపీలో చేరిన తర్వాత ఓడిపోయారు. మరికొందరు ఫిరాయింపుదారులు కూడా ఓటమి పాలయ్యారు. వీళ్ల పరిస్థితి చూసి కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు ఎందుకు ధైర్యం చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. దీనిపై తెలంగాణలోని ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English