ఉత్తమ్ రాజీనామా.. టీఆర్ఎస్‌లో విలీనం..!

ఉత్తమ్ రాజీనామా.. టీఆర్ఎస్‌లో విలీనం..!

ముందస్తు ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నుంచి గెలుపొందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులుకు అందజేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా గెలవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తమ్ తీసుకున్న నిర్ణయమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంప ముంచింది. ఉత్తమ్ రాజీనామాకు తోడు 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. దీంతో టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీన ప్రక్రియ సంపూర్ణమైంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం విలీనం చేస్తున్నట్లు శాసనసభ కార్యదర్శి ప్రకటన జారీ చేశారు.

 ఉత్తమ్ రాజీనామా ముందు వరకు కాంగ్రెస్ శాసనసభాపక్షం బలం 19 మంది. విలీనానికి మూడింట రెండొంతులు అంటే 13 మంది సభ్యులు అవసరం. తాజాగా ఉత్తమ్ రాజీనామాతో విలీనానికి అవసరమైన సభ్యుల సంఖ్య 12 అయింది. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు జై కొట్టారు. ఇక, గురువారం తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కేందుకు రెడీ అయ్యారు. దీంతో విలీనానికి కావాల్సిన సంఖ్య వచ్చేసింది. దీంతో సీఎల్పీ విలీనంపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు (పైలట్‌ రోహిత్‌రెడ్డి సహా ) గురువారం ఓ తీర్మానం చేశారు. తీర్మానం చేసిన పత్రంపై 12 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. సంతకాలు చేసిన విలీన పత్రాన్ని స్పీకర్‌ పోచారంకు అందజేశారు.

 ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేస్తూ శాసనసభ కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఇక, శాసనసభలో రెండో పెద్ద పార్టీగా ఏఐఎంఐఎం అవతరిస్తుంది. మజ్లిస్‌కు అసెంబ్లీలో ఏడుగురు సభ్యులున్నారు. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్‌కు మిగిలింది భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, పోదెం వీరయ్య, సీతక్కలు మాత్రమే. గతంలో సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), జాజాల సురేందర్‌ (ఎల్లారెడ్డి), రేగ కాంతారావు (పినపాక), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), హరిప్రియ (ఇల్లందు), వనమా వెంకటేశ్వర్‌రావు (కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్‌), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి) కాంగ్రెస్‌కి రాజీనామా చేసి టీఆర్ఎష్‌లో చేరిన విషయం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English