టీడీపీ నేతలకు సీరియస్ వార్నింగ్.. సంకేతాలిచ్చిన ప్రభుత్వం

టీడీపీ నేతలకు సీరియస్ వార్నింగ్.. సంకేతాలిచ్చిన ప్రభుత్వం

తెలుగుదేశం పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చిందా..? బుధవారం జరిగిన సంఘటనతో ఇది నిరూపణ అయిందా..? ఇకపై ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవలసి వస్తుందనడానికి సంకేతాలు పంపినట్లేనా..? అంటే దాదాపుగా అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ నాయకులు ఎవరైనా ఏపీ ప్రభుత్వంపై గానీ, తనపై గానీ, మరే ఇతర మంత్రులు, నాయకులపై గానీ అడ్డగోలుగా నోటికొచ్చినట్లు కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదంటున్నారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ప్రభుత్వ పరమైన, రాజకీయ పరమైన విమర్శలు అయితే ఓకే కానీ, వ్యక్తిగత దూషణలకు దిగితే చర్యలు తీసుకునేందుకు ఏపీ సీఎం సిద్ధం అయ్యారని తెలుస్తోంది. బుధవారం ఓ టీడీపీ ఎమ్మెల్యే విషయంలో జరిగిన పరిణామాలు దీనికి ఉదాహరణ అని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

 ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికైన వెలగపూడి రామకృష్ణబాబు.. ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన వైసీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యేపై విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఐపీసీ 294 (బి), 188 సెక్షన్ల కింద క్రైమ్‌ నంబర్‌ 158/19తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రామకృష్ణబాబుకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని ఆ నోటీసులో పేర్కొన్నారు.

 దీంతో స్టేషన్‌కు వచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ తీసుకోవాలంటూ ఎమ్మెల్యేను ఆదేశించారు. దీంతో వెలగపూడి బుధవారం సాయంత్రం ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఏసీపీ వైవీ నాయుడు, సీఐ లక్ష్మోజీ ఎదుట హాజరయ్యారు. పోలీసులు అరెస్టు చూపించి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. వాస్తవానికి ఈ వ్యవహారం వెనుక ఏపీ ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ పాలనకు విఘాతం కలిగించే వారిని కట్టడి చేయడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రభుత్వాన్నో, ముఖ్యమంత్రినో వ్యక్తిగతంగా విమర్శించడం మానేసి, ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తారనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ తరహా చర్యలకు సిద్ధం అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు, వెలగపూడి రామకృష్ణబాబుకు నోటీసులు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ నేతలంతా అలెర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, ఆ పార్టీలోని కొందరు నేతలు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English