ఆ పార్టీలోకి కేశినేని నాని.. ముహూర్తం ఫిక్స్..?

ఆ పార్టీలోకి కేశినేని నాని.. ముహూర్తం ఫిక్స్..?

రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నానుతున్న పేరు కేశినేని నాని. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించిన ఆయన తన వ్యవహార శైలితో హాట్ టాపిక్‌గా మారారు. తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పదవిని వద్దనుకున్న ఆయన.. పార్టీ అధిష్ఠానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పలు పోస్టింగులు చేస్తూ తన వైఖరిని చెప్పకనే చెబుతున్నారు. దీంతో ఈ టీడీపీ ఎంపీ పార్టీని వీడబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్లబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. నాని వ్యవహారంపై తాజాగా పూర్తిగా క్లారిటీ వచ్చేసింది.

 ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 9వ తేదీన శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమల వస్తారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయనకు ఏపీలో ఇదే తొలి పర్యటన. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు మోదీ ఏపీకి రానున్నారు. ఈ పర్యటనపై ఏపీ ప్రభుత్వానికి, తిరుమల తిరపతి దేవస్థానానికి పీఎంవో కార్యాలయం నుంచి సమాచారం అందింది. మోదీ పర్యటన కోసం రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు సైతం తగు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఈ పర్యటనకు ముందు రోజు అంటే జూన్ 8న కేశినేని నాని ఆ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. బీజేపీ నేతలు జీవీఎల్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో నాని కమలం గూటికి చేరనున్నారని సమాచారం.

 కేశినేని నాని ఇప్పటికే కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలను కలిశారు. కానీ, ఎవరికీ అనుమానం రాలేదు. అయితే, ఈలోపే పార్లమెంటరీ పదవులు కేటాయింపు కూడా నానికి అసహనం తెప్పించిందని తెలిసింది. డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, పార్టీ విప్‌గా కేశినేనిని నియమించినా.. ఆయన ఆ పదవుల్ని తిరస్కరించారు. తనకంటే సమర్థులైన నేతలకు అవకాశం ఇవ్వాలని.. ఎంపీ పదవికంటే ఏదీ తనకు గొప్ప కాదన్నారు. చంద్రబాబు తనను క్షమించాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ఇక, బుధవారం చంద్రబాబు పార్టీ మారితే తాను మారతానంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన శాంతించారు అనుకునే లోపే.. గురువారం ఉదయం ‘‘పోరాడితే పోయేదేముందు బానిస సంకెళ్లు తప్ప’’ అంటూ ట్వీట్ చేయడంతో పార్టీ మారుతారన్న వార్తలకు బలం చేకూరుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English