కేశినేని టార్గెట్ బాబు కాదు...ఆ టీడీపీ ఎంపీ

కేశినేని టార్గెట్ బాబు కాదు...ఆ టీడీపీ ఎంపీ

తెలుగుదేశంలో పార్టీలో ఓవైపు తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం అంశంపై పోస్ట్ మార్టం అంశం కొన‌సాగుతుండ‌గా మ‌రోవైపు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్ క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం టీడీపీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశనేని నాని, రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా సీఎం రమేష్‌ను నియమించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే 24 గంటలు కూడా గడవకముందే ఆ పదవిని తాను తీసుకోనంటూ కేశినేని నాని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు. ఈ ఎపిసోడ్‌లో చంద్ర‌బాబు టార్గెట్ కేశినేని వ్య‌వ‌హ‌రించార‌ని అంచ‌నా వేయ‌గా...ఆయ‌న టార్గెట్ టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ అని తాజా ప‌రిణామాలు పేర్కొంటున్నాయి.

లోక్‌సభలో పదవుల పంపకంపై కేశినేని తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అయిన నేప‌థ్యంలో, చంద్రబాబు కేశినేని నానికి ఫోన్ చేసి తన నివాసానికి రావాలని తెలిపారు. ఆయ‌న‌తో పాటు గల్లా జయదేవ్‌ను సైతం త‌న నివాసానికి పిలిపించారు. ఇద్ద‌రు ఎంపీల‌తో స‌మావేశ‌మైన చంద్రబాబు వారితో చ‌ర్చించారు. కేశినేని నాని పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరిస్తూ తన ఫేస్ బుక్ అకౌంట్ లో చేసిన పోస్ట్ కలకలం రేపిందని చంద్ర‌బాబు పేర్కొన‌గా...తాను పార్టీ మారుతున్నాన్న తప్పుడు ప్రచారం సమయంలో విప్ గా నియమిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని స‌మాచారం. గ‌ల్లా కుటుంబానికి పొలిట్ బ్యూరో, పార్లమెంటరీ పార్టీ పదవులు ఇవ్వడం స‌రికాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం.

పార్లమెంటరీ పార్టీ నేతగా రామ్ మోహన్ నాయుడుకి ఇవ్వాలని నాని కోరిన‌ట్లు తెలుస్తోంది. రామ్ మోహన్ నాయుడుకి ఫ్లోర్ లీడర్ ఇవ్వడం ద్వారా బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుందని చంద్రబాబుకి సూచించినట్లు స‌మాచారం. అయితే, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను ఈ విష‌యంలో బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ  ఇద్ద‌రు ఎంపీల‌తో చ‌ర్చ‌ల అనంత‌రం జ‌య‌దేవ్‌కు బ‌దులుగా రామ్మోహ‌న్‌నాయుడు ప‌ద‌వి అప్ప‌గిస్తారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English