వైసీపీ పిలుస్తోంది... ముద్రగడ ఏమంటారో?

వైసీపీ పిలుస్తోంది... ముద్రగడ ఏమంటారో?

ముద్రగడ పద్మనాభం... కాపులకు రిజర్వేషన్లు కావాలంటూ ఏళ్ల తరబడి ఉద్యమం సాగిస్తున్న నేత. ఉద్యమ నేతగా ముద్రపడ్డ ముద్రగడకు ఇప్పుడు చాలా క్లిష్టమైన సమస్యే వచ్చి పడిందన్న వాదన వినిపిస్తోంది. రాజకీయాల్లో ఉండగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ముద్రగడ... అప్పుడు కూడా కాపులకు రిజర్వేషన్లే లక్ష్యంగా తనదైన శైలిలో కొనసాగారు. తన డిమాండ్లను సాధించుకునేందుకు ముద్రగడ సాగించిన ఉద్యమం ఆసక్తి రేకెత్తించేదే. అయితే ఇప్పుడు ముద్రగడ ఉద్యమం వదిలేసి సైలెంట్ గా కూర్చున్నారు.

ఎన్నికలకు సమయం ఆసన్నమయ్యేదాకా ఉద్యమించిన ముద్రగడ... ఎన్నికల వేళ మాత్రం సైలెంట్ అయిపోయిన వ్యవహారం ఏ ఒక్కరికి కూడా అంతు చిక్కలేదు. సరే.. ఎన్నికలు ముగిశాయి. వైసీపీ గెలిచింది. జగన్ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పేరు ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. వైసీపీలో చేరాలంటూ జగన్... ముద్రగడకు ఆహ్వానం పలికినట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కాపులకు రిజర్వేషన్లపై జగన్ స్పష్టమైన హామీ ఇవ్వకున్నా... కాపుల్లో మెజారిటీ ఓట్లు వైసీపీకే పడ్డాయి. ఈ వ్యూహం వెనుక ముద్రగడను జగన్ బాగానే వినియోగించుకున్నారన్న వాదనా లేకపోలేదు.

ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో తనకు తెర వెనుకే ఉండి ఎంతగానో ఉపయోగపడ్డ ముద్రగడను తన పార్టీలో చేర్చుకునేందుకు జగన్ ఆసక్తి చూపిస్తున్నారట. జగన్ ఆహ్వానాన్ని మన్నించి ముద్రగడ వైసీపీలో చేరితే... ఆయనకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పంపేందుకు కూడా జగన్ సిద్ధంగానే ఉన్నారట. మరి కాపులకు రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరు సాగిస్తున్నట్లుగా కనిపించిన ముద్రగడ... ఇలా కేకేసి పిలుస్తున్న వైసీపీ ఆఫర్లకు ఆకర్షితుడై ఆ పార్టీలో చేరితే.. ఉద్యమ కారుడిగా తనకున్న ఇమేజీ ఏం కావాలి? ఇక్కడే ముద్రగడ కాస్తంత ఆలోచనలో పడ్డారట. చూద్దాం... మరి బంపర్ ఆఫర్లకు ముద్రగడ లొంగుతారో, లేదంటే తన ఉద్యమాన్ని కొనసాగిస్తారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English