జగన్ ఘర్‌వాపసీ నిజమేనా?

జగన్ ఘర్‌వాపసీ నిజమేనా?

వైసీపీ తిరుగులేని విజయం సాధించిన తరువాత, వైఎస్ జగన్మోహనరెడ్డి సీఎం అయ్యాక సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. జగన్ హిందూ సంప్రదాయం ప్రకారం కొన్ని పూజలు చేస్తుండడం అందులో కనిపించింది. దీంతో జగన్‌ క్రైస్తవం నుంచి మళ్లీ హిందూత్వంలోకి వచ్చారంటూ ప్రచారం జరిగింది. నిజానికి ఆ వీడియోల సందర్భం వేరు.. జగన్ క్రైస్తవం నుంచి హిందూత్వంలోకి ఏమీ రాలేదు. అవన్నీ ఫేక్ పోస్టింగులు. కానీ... జగన్ హిందూత్వంలోకి మళ్లీ రాలేదు అనే కంటే హిందూత్వను వీడలేదు.. ఆయన తనకు పూర్వీకుల నుంచి, జన్మత: వచ్చిన క్రైస్తవ మతంలో ఉన్నప్పటికీ తన హిందూత్వ మూలాలను, ఆచారాలను, పద్ధతులను వీడలేదనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. ముహూర్త ఆచరణ, వాస్తు బలాలు చూసుకోవడం వంటివన్నీ జగన్ హిందూ సంప్రదాయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఆధారాలుగా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా జగన్ విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సూచనలు ఫాలో అవుతుండడం దీనికి ఊతమిస్తోంది. తాజాగా ఆయన స్వరూపానంద ఆశీస్సులు కోసం విశాఖ వెళ్తున్నారు.  తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా శారద పీఠానికి చేరుకుని, స్వామి స్వరూపానంద ఆశీస్సులు తీసుకోనున్నారు.

త్వరలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనుండడంతో  స్వరూపానంద సలహాలు, సూచనలు తీసుకోవడానికే జగన్ శారద పీఠానికి వెళ్లారని సమాచారం. ప్రమాణ స్వీకారం, సచివాలయంలోని తన చాంబర్‌లోకి ప్రవేశించేందుకు అనువైన ముహూర్తం వంటివి స్వరూపానంద సూచన మేరకే జగన్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు.. మంత్రివర్గంలో ఎంత మంది ఉండాలి.. తాను అనుకుంటున్నవారి జాతకాలు, వారి జాతకాల్లోని గ్రహగతుల కారణంగా తనకేమైనా ఇబ్బందులుంటాయా అనేది కూడా పరిశీలించి చెప్సాల్సిన బాధ్యతనూ స్వరూపానంద భుజస్కంధాలపై పెడుతున్నారట.

మరోవైపు జగన్ సీఎం అయిన తరువాత అమరావతిలో సచివాలయం, సీఎం చాంబర్ వంటివాటిలో వాస్తు పరమైన మార్పులు చేస్తున్నారు. దీంతో టెక్నికల్‌గా జగన్ ఘర్ వాపసీ కాకపోయినా ఆచారాలు పాటించడంలో పట్టింపుతో ఉండడం వల్ల ఘర్ వాపసీగానే కనిపిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English